విశాఖపట్నం దుర్ఘటనకు సంబంధించి గ్యాస్ లీక్ అయిన ప్రాంతాల్లో పశువులకు కూడా మంచి చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. అక్కడ 13 వెటర్నరీ బృందాలు పని చేస్తున్నాయని, పశువులకు సెలైన్ ఎక్కించడంతో పాటు, ఇతరత్రా అవసరమైన వైద్య సేవలందిస్తున్నామని అధికారులు వివరించారు.
సాక్షి, అమరావతి: డిశ్చార్జ్‌లు పెరుగుతున్న తరుణంలో మరింత శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. ఇప్పటికే మంచి వైద్యం అందజేస్తున్నామని, వసతుల్లో లోటు లేకుండా చూస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోకి వస్తున్న వారిపై దృష్టి సారించాలని సూచించారు. కోవిడ్–19 నివారణ చర్యలు, ఆక్వా ఫీడ్ ధరలపై శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆక్వా ఫీడ్ రేటు పెరగడంపై సీఎం ఆరా తీశారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులను ఆదుకునేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్బంగా కోవిడ్–19 నివారణకు తీసుకుంటున్న చర్యలను, పరీక్షల సరళిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి.
► రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే, డిశ్చార్జీల సంఖ్య పెరుగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 43 కేసులు నమోదైతే, ఇందులో 31 కేసులు పాత క్లస్టర్ల నుంచే వచ్చాయని, 45 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
► చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన రైతులతో పాటు, అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిన వారి మీద దృష్టి పెట్టామని అధికారులు తెలిపారు. కోయంబేడు మార్కెట్ వల్ల చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రానికి తిరిగి వస్తున్న వలస కార్మికులపై దృష్టి పెడుతున్నామని చెప్పారు.
► కంటైన్‌మెంట్ క్లస్టర్లలో ఉంటున్న వారికి ఎక్కువగా పరీక్షలు చేస్తున్నామని, వైరస్ వ్యాప్తి దాదాపుగా ఆ క్లస్టర్లకే పరిమితం చేయగలుగుతున్నామన్నారు. ఇది ఒక మంచి పరిణామం అని అభిప్రాయపడ్డారు.
ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
అనుమతి లేకుండా కూలీల రాక
► 700 మంది కూలీలు ఎలాంటి అనుమతులు, పరీక్షలు లేకుండానే రాష్ట్రంలోకి ప్రవేశించారని అధికారులు సీఎంకు వివరించారు. స్థానిక అధికారుల సహాయంతో వారి వివరాలు కనుక్కొని పరీక్షలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
► ఐసోలేషన్ ప్రక్రియను మొదలుపెట్టామని అధికారులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో వైరస్ ముప్పు పొంచి ఉందన్నారు. వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పారు.
టెలి మెడిసిన్
► టెలి మెడిసిన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని అధికారుల వెల్లడించారు. ద్విచక్ర వాహనాల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
► ప్రస్తుతం దాదాపు 500 కాల్స్ మాత్రమే పెండింగులో ఉన్నాయని చెప్పారు. రోగులు కాల్ చేసిన 24 గంటల్లోగా వారికి ఔషధాలు అందించేలా చూస్తామన్నారు.
సరిహద్దుల్లో వైద్య పరీక్షలు
► సరిహద్దుల్లోని 11 చెక్ పోస్టుల వద్ద వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీంకు వివరించారు. అక్కడ వైద్యులు కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు.
► సరిహద్దులు దాటి వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్, ప్రాథమిక పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.
► ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.ఎస్ జవహర్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
► రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసిన పరీక్షలు 1,65,069
► శుక్రవారం ఒక్క రోజే 8,388 పరీక్షలు
► రాష్ట్రంలో ప్రతి మిలియన్‌కు 3,091 పరీక్షలు.. తమిళనాడులో 2,799, రాజస్థాన్‌లో 1,942 పరీక్షలు.
► పాజిటివిటీ రేటు రాష్ట్రంలో 1.17 శాతం, దేశంలో 3.92 శాతం
► మరణాల రేటు ఏపీలో 2.28 శాతం, దేశంలో 3.3 శాతం
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారే రాష్ట్రంలో మరణిస్తున్నారు. కరోనా లక్షణాలున్నాయని ఏమాత్రం అనుమానం వచ్చినా, వెంటనే సమాచారం ఇస్తే ఈ ముప్పు దాదాపు తప్పుతుంది. ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం.
– సీఎంతో అధికారులు
Comments
Please login to add a commentAdd a comment