గుంటూరు జిల్లా పొగాకు ఉత్పత్తిదారులు, క్యూరర్ల సహకార మార్కెటింగ్ సంఘం (కోల్ సొసైటీ) నూతన పాలకవర్గ ఎన్నికలు ఎట్టకేలకు నిర్వహించనున్నారు.
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ది గుంటూరు జిల్లా పొగాకు ఉత్పత్తిదారులు, క్యూరర్ల సహకార మార్కెటింగ్ సంఘం (కోల్ సొసైటీ) నూతన పాలకవర్గ ఎన్నికలు ఎట్టకేలకు నిర్వహించనున్నారు. కోల్ సొసైటీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ విడుదల చేశారు. డిసెంబర్ 13న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు నూతన పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. ఎన్నికల అధికారిగా ఒంగోలు డివిజనల్ సహకారాధికారి కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రారుగా పని చేస్తున్న కే వెంకటేశ్వర్లును నియమించారు. ఈ సొసైటీలో ప్రకాశం, గుంటూరు జిల్లాల సభ్యులు ఓటర్లుగా ఉన్నారు.
ఈ రెండు జిల్లాల్లోని కొన్ని సొసైటీలకు కూడా కోల్ సొసైటీలో సభ్యత్వం ఉంది. కోల్ సొసైటీ పాలకవర్గ గడువు ముగిసి రెండు సంవత్సరాలయింది. సొసైటీ అధ్యక్షుడు ఇనగంటి పిచ్చిరెడ్డి పదవీ కాలం ముగియకముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేసింది. పదవీ కాలం ముగిసిన తర్వాత కొన్నాళ్లు కోర్టు ఉత్తర్వులతో పిచ్చిరెడ్డి సొసైటీ అధ్యక్షునిగా కొనసాగారు. ఆ తర్వాత కొన్నాళ్లు అధికారులు పర్సన్ ఇన్‌చార్జి కమిటీని నియమించారు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి సుబ్బారెడ్డి సొసైటీ పీఐసీ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సొసైటీకి ఎన్నికలు నిర్వహించేందుకు కలెక్టర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
షెడ్యూలు ఇదీ: కోల్ సొసైటీ ఎన్నికల షెడ్యూల్‌ను కలెక్టర్ సోమవారం విడుదల చేశారు. నవంబర్ 9న కోల్ సొసైటీ సీఈఓ ఓటర్ల జాబితా తయారు చేసి ప్రకటిస్తారు. ఆ జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలుపుకోవచ్చు. నవంబర్ 14న సొసైటీ ఓటర్ల తుది జాబితాను సీఈఓ ప్రకటిస్తారు. నవంబర్ 20న ఓటర్ల జాబితాను సీఈఓ ఎన్నికల అధికారికి అందజేస్తారు. నవంబర్ 24న ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి పరిశీలిస్తారు. డిసెంబర్ 2న కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ కోల్ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. డినంబర్ 3న సొసైటీ ఎన్నికల అధికారి నామినేషన్ల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. డిసెంబర్ 7న నామినేషన్ల స్వీకరణ, 8న నామినేషన్ల పరిశీలన, 9న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 13న పోలింగ్ (ఎన్నికల నిర్వహణ) అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఎన్నికైన పాలకవర్గ సభ్యుల సమావేశం నిర్వహించి సొసైటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరిస్తుంది.