తీరంలో అలజడి.. తీరప్రాంతవాసుల్లో ఆందోళన | coastal areas on high alert | Sakshi
Sakshi News home page

తీరంలో అలజడి.. తీరప్రాంతవాసుల్లో ఆందోళన

Published Thu, Oct 10 2013 3:42 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

బాపట్ల టౌన్, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సూర్యలంక సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. బుధవారం సాయంత్రానికి అలల ఉధృతి పెరగడంతోపాటు 70 మీటర్ల మేర సముద్రం ముందుకురావడంతో తీరప్రాంతవాసుల్లో ఆందోళన నెలకొంది.

బాపట్ల టౌన్, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సూర్యలంక సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. బుధవారం సాయంత్రానికి అలల ఉధృతి పెరగడంతోపాటు 70 మీటర్ల మేర సముద్రం ముందుకురావడంతో తీరప్రాంతవాసుల్లో ఆందోళన నెలకొంది. అల్పపీడనం కారణంగా కోస్తాప్రాంతాల్లో తుపాను వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు సూచించడం.. రాత్రి భారీ వర్షం కురవడం, సముద్రంలోని అలలు ఒక్కసారిగా ఎగిసిపడడాన్ని గమనించిన తీరప్రాంతవాసులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయబ్రాంతులకు లోనవుతున్నారు.
 
తీరప్రాంతవాసుల్లో ఆందోళన
గంగమ్మను నమ్ముకొని జీవనం సాగించే గంగపుత్రులు సముద్రంలో మార్పులు వచ్చాయంటే కలవరపడుతున్నారు. గతంలో వచ్చిన లైలా, జల్, థానె, నీలం తుపానులు మత్స్యకారులను కొలుకోలేని దెబ్బతీశాయి. దీంతో సముద్రంలో ఎప్పుడు మార్పులు వచ్చినా మత్స్యకార కుటుంబాల్లో కలవరం మొదలవుతోంది. నాలుగునెలలుగా వేట సాగక.. తీరం వెంబడి పడవలను నిలుపుదల చేసిన మత్స్యకారులు హుటాహుటిన చేరుకొని పడవలు, వలలను మెరకప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. రాత్రికి బాపట్ల తహశీల్దార్ జీవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌ఐ, వీఆర్వోల బృందం సూర్యలంక తీరం వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
 
తీరంలో వేటకు వెళ్లొద్దు.. 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సూర్యలంక సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. గాలితీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రెండురోజుల క్రితం వేటకు వెళ్లిన మత్స్యకారులను కూడా వాళ్ల బంధువుల ద్వారా సమాచారం అందించి వెనక్కి రావాల్సిందిగా సూచించాం. సముద్రం యథాస్థితికి వచ్చేంతవరకు ఎవరూ వేటకు వెళ్లవద్దు.  ప్రస్తుతానికి తీరప్రాంత గ్రామాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేవిధంగా చర్యలు తీసుకుంటాం.  
 -ఉషాకిరణ్, ఎఫ్‌డీవో
 
మత్స్యకారులకు సమాచారం ఇచ్చాం.. 
వాతావరణంలో మార్పుల వల్ల సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మరబోటులతో వేటకు వెళ్లిన 25మంది మత్స్యకారులకు ఫోన్‌ద్వారా సమాచారం అందజేశాం. వాళ్లు కూడా బయటకు వస్తున్నారు. తీరం ఒడ్డున ఉన్న పడవలు మొత్తం మెరక ప్రాంతాలకు తరలించుకుంటున్నాం. సముద్ర తీవ్రతకు తోడు గాలి కూడా వేగంగా వీస్తోంది. 
 -కొక్కిలిగడ్డ వెంకటస్వామి, మత్స్యకారసంఘ 
 
 యూనియన్ నాయకుడు, ఆదర్శనగర్
 వేటకు వారం ఆగాల్సిందే.. సముద్రంలో అల్లకల్లోలం చూస్తుంటే ఇప్పట్లో వేటకు పరిస్థితులు కనిపించడం లేదు. సముద్రం అతలాకుతలంగా ఉంది. ఈదురుగాలులతో వాతావరణం చల్లబడింది. ఈ పరిస్థితుల్లో సముద్రం శాంతించినా మరో వారంపాటు వేటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.  
 -నాగేశ్వరరావు, మత్స్యకారుడు, కృపానగర్ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement