‘కత్తులు’ విశ్రమించాక ఖబడ్దార్ | Cock-fighting in Kakinada | Sakshi
Sakshi News home page

‘కత్తులు’ విశ్రమించాక ఖబడ్దార్

Published Fri, Jan 17 2014 1:48 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

‘కత్తులు’ విశ్రమించాక ఖబడ్దార్ - Sakshi

‘కత్తులు’ విశ్రమించాక ఖబడ్దార్

 సాక్షి ప్రతినిధి, కాకినాడ : బరులు సద్దుమణిగాక కొరడా ఝుళిపించారు పోలీసులు. మూగజీవుల నెత్తురు నేలలో ఇంకి, వాటి మరకలు సైతం మాసిపోయాక.. చట్టవిరుద్ధమైన ఈ హింసను అడ్డుకోవడానికి ‘మేమున్నాం, ఖబడ్దార్’ అన్నారు. అది కూడా.. గర్జించినట్టు కాక గొణిగినట్టే అన్నారు. పెద్ద పండగలో తొలి రెండురోజులూ కోడిపందేల రాయుళ్ల కత్తికి ఎదురే లేకుండా జిల్లాలో బరులు నిర్వహించారు. బరుల జోలికి వెళ్లొద్దంటూ ప్రజాప్రతినిధులు గిరి గీయడం, దానికి తోడు పందేల నిర్వాహకులు ఎంతో కొంత ‘చేతులు తడపడం’తో పోలీసులు మంగళ, బుధవారాల్లో చేతులు ముడుచుకుని ఊరుకున్నారు. గురువారం మాత్రం ఉనికిని చాటుకోవడానికా అన్నట్టు మొక్కుబడిగా దాడులు చేశారు. అవి కూడా కోనసీమకే పరిమితం కాగా  మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో వరుసగా మూడోరోజూ ‘మూడు పుంజులు, ఆరు  పందేలు’ అన్న రీతిలో యథేచ్ఛగా పందేలు జరిగాయి.
 
 ఒక్క గురువారం నాడే జిల్లా అంతటా కోడిపందేలు, గుండాటల ద్వారా సుమారు రూ.15 కోట్లు చేతులు మారినట్టు అంచనా.అక్కడి ‘బరుల’ ముడుపు రూ.20 లక్షలు పందేల సందర్భంగా కృష్ణా, విశాఖ జిల్లాల్లో పందేల రాయుళ్లు పోలీసులపై ఎదురుదాడులకు దిగటంతో జిల్లా ఎస్పీ శివశంకరరెడ్డి కొంత కఠినవైఖరిని ప్రదర్శించారు. ఆయన ఆదేశాలతో గురువారం అల్లవరం మండలం గోడిలంక, ఆత్రేయపురం మండలం తాడిపూడి, ఐ.పోలవరం మండలం కేశనకుర్రు గ్రామాల్లో  పందేలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే మంగళ, బుధవారాల్లో ఆ ప్రాంతాల్లో పోలీసుల వెన్నుదన్నుతో పెద్ద ఎత్తున పందేలు జరిగాయి. ఆ రెండురోజుల్లో ఈ మూడు చోట్లా కోడిపందేలు, గుండాటల ద్వారా నాలుగైదు కోట్లు చేతులు మారినట్టు అంచనా. ఇక్కడ రెండు రోజులపాటు ఎలాంటి ఆటంకం లేకుండా పందేలు నిర్వహించుకునేందుకు నిర్వాహకుల నుంచి పోలీసులకు రూ.20 లక్షలు అందినట్టు సమాచారం. పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి, రాజోలు నియోజకవర్గంలోని చింతలమోరి, మట్టపర్రు, రాజోలు మండలం చింతపల్లిలలో పందేలు జోరుగా జరిగాయి.  ఐ.పోలవరం మండలంలో అక్కడక్కడా కూరపందేలు కూడా జరిగాయి. 
 
 దొరగారి ‘తోట’ సాక్షిగా..
 ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్ల ఫలితంగా పందేలను కోనసీమలో కట్టడి చేయడంతో పందేల రాయుళ్లు మెట్టకు తరలి వెళ్లడంతో గురువారం ఆ ప్రాంతంలో పందేలు జోరుగా సాగాయి. గోకవరం, సామర్లకోట, వేట్లపాలెం, కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ, తిమ్మాపురం, అచ్చంపేట, పెదపూడి మండలం రాజుపాలెం, రామేశ్వరం లంకల్లో గురువారం ముమ్మరంగా జరిగిన పందేల్లో నాలుగైదు కోట్లు చేతులు మారినట్టు అంచనా. జగ్గంపేట, గోకవరం, కిర్లంపూడి మండలం కాట్రావులపల్లి, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పందేలు జరిగినా పోలీసులు  నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరించారు. కిర్లంపూడి దొరగారి తోటలో పందేలు మంత్రి తోట నరసింహం కనుసన్నల్లోనే  జరగడంతో పోలీసులు కిమ్మనకుండా ఉండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పందేలు పూర్తయి, బరులు సద్దుమణిగాక పోలీసులు హడావిడి చేసి పోయారంటున్నారు. రాజమండ్రి సమీపంలో దివాన్‌చెరువు, రాజానగరం పరిసర ప్రాంతాల్లోని పాలచర్ల, శ్రీకృష్ణపట్నం, తుని నియోజకవర్గంలో వల్లూరు, తేటగుంట, కోటనందూరు, తొండంగిలలో  సైతం పెద్ద ఎత్తున పందేలు జరిగాయి. మొత్తం మీద పండగ బరిలో ఏ పుంజు గెలిచినా, ఏ పుంజు తోక ముడిచినా.. సంప్రదాయం పేరుతో కోట్లాదిరూపాయల నెత్తుటి జూదం ప్రజాప్రతినిధుల దన్నుతో, పోలీసుల అండతో యథేచ్ఛగా జరిగింది. దాన్ని నిరోధించాల్సిన చట్టం మాత్రం.. కత్తి గుండెల్లో దిగిన కోడిలా నిస్సహాయంగా మట్టి కరిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement