హవ్వ.. కోళ్లు నవ్వ
Published Fri, Jan 17 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
భీమవరం, న్యూస్‌లైన్ :పందెగాళ్లు మూడు రోజులపాటు బరితెగించి మరీ బహిరంగంగా కోడి పందాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సాక్షిగా వేలాది కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి బరుల్లోకి వదిలారు. కోట్లాది రూపాయలను లూటీ చేశారు. ఇంత జరిగినా పట్టించుకోని పోలీసులు ఉన్నట్టుండి కనుమ రోజైన గురువారం నాడు పందేలు నిర్వహించిన బరుల్లోకి వచ్చారు. ‘బాబ్బాబు.. మా బాస్ కోప్పడుతున్నారు. ఒక్కొక్క పుంజును.. ఒకరిద్దరు పుందెగాళ్లను అప్పగించండి. చిన్నచిన్న కేసులు పెట్టి కోర్టుకు పంపిస్తాం’ అంటూ బతిమాలుకున్నారు. జాలిపడిన పందేల నిర్వాహకులు ఒకరిద్దరిని అప్పగించి.. వారి చంకల్లో కోడి పుంజుల్ని పెట్టి పోలీస్ స్టేషన్లకు పంపించారు.
ఎవరేమనుకుంటే మాకేంటి
పోలీసుల వైఖరిని చూసి సామాన్యులు సైతం ముక్కున వేలేసుకున్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారి జిల్లాలోని పందాల బరుల్లో అగ్రస్థానంలో నిలిచిన ప్రకృతి ఆశ్రమం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ప్రకృతి ఆశ్రమంతోపాటు దీనికి చుట్టుపక్కల ప్రాంతాల్లో లెక్కకు మిక్కిలిగా బరులు వెలిశారుు. పందాలు ఇంత తీవ్రస్థారుులో జరిగినా వన్‌టౌన్ పోలీసులకు దొరికింది నలుగురు పందాల రాయుళ్లు, రెండు కోళ్లు మాత్రమేనట. వారినుంచి రూ.900 స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు వ్యక్తులు, రెండు కోళ్లను, రూ.1,550 నగదును స్వాధీనం చేసుకున్నారు. పాలకోడేరు పోలీస్టేషన్ పరిధిలో 11మందిపై కేసులు నమోదు చేసి 6 కోళ్లను, రూ.4,100 సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఇదే తరహాలో చిన్నపాటి కేసులు పెట్టిన పోలీసులు చేతులు దులిపేసుకున్నారు.
Advertisement
Advertisement