
భూములు ఇష్టపడి ఇస్తేనే సేకరించండి
విజయవాడ బ్యూరో: "రాజధాని కోసం రైతులు ఇష్టపడి భూములిస్తే సంతోషమే. ఇవ్వలేమన్న రైతులను వదిలేయడం మంచిది. కాదని ప్రభుత్వం మొండిగా భూ సేకరణకు దిగితే మాత్రం ఊరుకోను. బాధిత రైతుల పక్షాన పోరాటం చేస్తా, రోడ్డు మీదకొచ్చి జనసేన సత్తా చూపుతా" అని ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు ధైర్యం చెప్పారు. రైతుల కన్నీళ్లతో కొత్త రాజధాని నిర్మాణం మంచిది కాదనీ, 33 వేల ఎకరాల్లో సింగపూర్ తరహా రాజధాని ఏ మేరకు అవసరమో పాలకులు పునస్సమీక్షించుకోవాలని హితవు చెప్పారు.
గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఆయన ఉండవల్లి, పెనుమాక, యర్రబాలెం, బేతపూడి, తుళ్లూరు గ్రామాల్లో పర్యటించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు ఏ పార్టీకి చెందిన వారైనా తనకు పట్టింపులేదని, అన్నదాతల భూముల విషయంలో పడుతున్న ఇబ్బందులే తాను పట్టించుకుంటానన్నారు. ఇక్కడికొచ్చే ముందు సీఎంతోనూ, మంత్రులు పుల్లారావు, నారాయణతోనూ మాట్లాడాననీ, రైతులెవరూ నష్టపోకూడదన్నదే తన వాదనగా చెప్పి వచ్చానన్నారు. "భూములివ్వడం ఇష్టం లేని రైతులెవ్వరూ భయపడొద్దు. ప్రభుత్వం భూ సేకరణకు వస్తే పోరాటం చేద్దాం. కాదని మొండికేస్తే ఆమరణదీక్ష చేస్తానని" పవన్ కల్యాణ్ చెప్పారు.
ప్రత్యేక హోదా కోసం ఎంపీలు పోరాడాలి..
యర్రబాలెం, బేత పూడి గ్రామ సభల్లో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రత్యేక హోదా దక్కకపోతే అది రాష్ట్ర పాలకులు, ప్రజాప్రతినిధుల వైఫల్యమే అవుతుందన్నారు. ఎంపీలందరూ దీనికోసం పోరాటం చేయాలన్నారు. తాను త్వరలోనే ఢిల్లీ వెళ్తాననీ, తెలుగు జాతికిచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చెబుతానన్నారు.‘ఏరా...ఆంధ్రా కొడకా’ అని పదేపదే కేసీఆర్ అనే మాటల్ని పడ్డామనీ, కేంద్రం దగ్గరకెళ్లి దేహీదేహీ అని అడిగే పరిస్థితి వద్దన్నారు.
అభిమానుల తీరుపై పవన్ తీవ్ర అసంతృప్తి
అభిమానుల అత్యుత్సాహం తొక్కిసలాటకు దారితీయడంతో పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. గోల చేయొద్దంటూ చేతులెత్తి పదేపదే నమస్కరించినా మాట వినని కుర్రాళ్లపై ఆయన మండిపడ్డారు. ఉండవల్లి సభలో తొక్కిసలాట జరిగింది. ఫలితంగా కుర్చీలు, బారికేడ్లు విరిగిపోయాయి. మహిళలు పరుగులు తీశారు. యర్రబాలెంలో కూడా పవన్‌కు ఈ అనుభవం ఎదురైంది.