
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులు) యూనిక్ డిజబిలిటీ గుర్తింపు కార్డులను(యూడీఐడీ) జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు బస్సులు, రైళ్లలో ప్రయాణాలకు రాయితీ పొందడానికి ఈ స్మార్ట్ కార్డును చూపిస్తే సరిపోతుంది. అర్హుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేకరించి, ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలను చేపడుతోంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఫర్ అసెస్‌మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ ఫర్ యాక్సెస్ రిహాబిలిటేషన్, ఎంపవర్‌మెంట్(సదరమ్) సర్టిఫికెట్లు కలిగిన వారు మళ్లీ ఇందుకోసం వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ‘సెర్ప్’ వద్ద ఉన్న డేటాను వినియోగించుకోనున్నారు. దివ్యాంగులకు స్వావలంబన కార్డు పేరిట స్టాండర్డ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సైజులో జారీ చేయనున్న యూడీఐడీతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దివ్యాంగులు తమ వైకల్యాన్ని రుజవు చేసేందుకు సర్టిఫికెట్లను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. అన్ని రాష్ట్రాల్లో వీటిని ఆమోదించేలా చర్యలు తీసుకుంటారు. అంగవైకల్యం వివరాలను కార్డు రీడర్ డివైస్ ద్వారా తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment