
మామ్మూళ్ల మత్తు..!
♦ ఎక్సైజ్ శాఖలో ప్రారంభమైన కలెక్షన్ల పర్వం
♦ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు
♦ ఒక్కో దుకాణానికి రూ.4,500 వసూలు
♦ ఆవేదనలో లైసెన్స్‌దారులు
♦ అధికారుల తీరుపై ఆరోపణలు
విజయనగరం రూరల్: ‘ఇన్నాళ్లు మీరు ఎంత తీసుకు న్నా అనవసరం.. ఇక నుంచి మామ్మూళ్లు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు’ ఇదీ రెండు నెలల కిందట ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బందికి ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ లక్ష్మీనరసింహం హెచ్చరిక. వీటిని రెండు రోజుల కిందటి వరకు అమలు చేసిన ఆ శాఖ అధికారులు మళ్లీ మామ్మూళ్ల వసూళ్లకు తెరతీశారు. దీంతో దుకాణదారులు గగ్గోలు పెడుతున్నారు. విధిలేక కొన్నిచోట్ల ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మకాలు సాగిస్తున్నామని చెబుతున్నారు.
గతంలో రూ.30 వేలు.. ఇప్పుడు రూ.4,500
గతంలో ఒక్కో దుకాణానికి ఎక్సైజ్‌శాఖ అధికారులు నెలకు రూ.30 వేలు వసూలు చేసేవారు. కమిషనర్ హెచ్చరికలతో రెండు నెలలు నుంచి కమీషన్లు లేకపోవడంతో తల్లడిల్లిపోయారు. జిల్లా ఉన్నతాధికారి ఒకరికి నెలకు ఒక్కో దుకాణం నుంచి రూ.మూ డు వేలు నుంచి రూ. ఆరువేల వర కు ఒక్కో ఎస్‌హెచ్‌వో (స్టేషన్ హౌజ్ ఆఫీస ర్) వసూళ్లు చేసిన మొత్తాలను అందించేవారని భోగట్టా. ఏరియాలు, అమ్మకాలను బట్టి వసూళ్లు అందించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. నిఘా విభాగంలో ఒక ఉన్నత అధికారి పోస్టు సంవత్సర కాలం నుంచి ఖాళీగా ఉండటంతో అక్కడ నుంచి సదరు అధికారికి నెలకు లక్షలాది రూపాయల మామ్మూళ్లు అందేవని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు.
ఎంఆర్‌పీకి మించి అమ్మకాలు సాగించిన సమయంలో ఒక్కో ఉన్నతాధికారికి రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నెలవారీ మామ్మూళ్లు అందేవన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును ఎవరికీ అనుమానం రాకుండా విజయనగరం డివిజన్‌లో పనిచేస్తున్న ఒక ఎస్‌హెచ్‌వో కుటుంబీకుడు హవాలా రూపంలో వాటిని ఉన్నతాధికారుల ఇంటికి చేరవేసేవారని సమాచారం. రెండు నెలలపాటు ఆగిన మామ్మూళ్ల దందా శుక్రవారం నుంచి మళ్లీ ఆరంభం కావడంతో లైసెన్స్‌దారుల్లో టెన్షన్ మొదలైంది.
నిఘా విభాగం ఆధ్వర్యంలో...
జిల్లాలో నాటుసారా, అధిక ధరలకు మద్యం విక్రయాలను అరికట్టాల్సిన నిఘా విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులుగా యథావిధిగానే మామ్మూ ళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో దుకాణం నుంచి వసూలు చేసిన రూ.4,500లలో ఒక ఉన్నతాధికారికి రూ.2000, మిగిలిన రూ.2,500లను సిబ్బంది పంచుకునేందుకు ఒప్పందం జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. రెండు నెలలకు కలిపి మద్యం దుకాణదారుల నుంచి రూ.9 వేలు చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నట్టు సమాచారం. మరో వారం రోజుల్లో ఎలాగూ పాత లైసెన్స్ విధానం ముగిసిపోతుందని, ఈలోగా అందినకాడికి వసూలు చేయాలని సదరు అధికారి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు సిబ్బందిలో కొందరు బహిరంగంగా చెబు తుండడం గమనార్హం.
వేలం నిర్వహణ ఖర్చు నిధులు ఏమైయ్యాయో?
నూతన మద్యం విధానంలో రెండు నెలల కిందట మద్యం దుకాణాల వేలం పాట నిర్వహణకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయో ఇప్పటికీ తెలియడం లేదు. జిల్లాలోని 13 ఎస్‌హెచ్‌వోలు నిర్వహణ ఖర్చుల కింద ముందుగా రూ.మూడు లక్షలు వసూలు చేసి ఖర్చు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఎస్‌హెచ్‌వోలకు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఎస్‌హెచ్‌వోలకు అందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని ఉన్నతాధికారులే తీసేసుకున్నట్టు ఎస్ హెచ్‌వోలు పలువురు ఆరోపిస్తున్నారు.
మద్యం దుకాణాలకు చివరిలో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంటే.. మళ్లీ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, డబ్బులు ఇవ్వకపోతే అక్రమ కేసుల పేరుతో భయపెట్టి వసూలు చేస్తున్నారని లైసెన్స్‌దారులు పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లాలో జరుగుతున్న అక్రమ వసూళ్లపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇదే విషయంపై ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్, ఇన్‌చార్జి ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ టి.నాగలక్ష్మిని ఫోన్‌లో సంప్రదించగా ఆమె స్పందించ లేదు.