పెరుగుతున్న కిక్కు! | Excise Department Delayed on Sara Packets Sales | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న కిక్కు!

Published Mon, Mar 4 2019 7:54 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM

Excise Department Delayed on Sara Packets Sales - Sakshi

ఈ చిత్రంలో కనిపిస్తున్నవి వాటర్‌ప్యాకెట్లు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఇది అచ్చంగా ఏనాడో నిషేధించామని చెబుతున్న సారా ప్యాకెట్లు. బొబ్బిలి మండలం నారాయణప్పవలస వెళ్లే దారిలో అధికంగా కనిపిస్తుంటాయి. బొబ్బిలి పట్టణ నడిబొడ్డున కొన్ని వీధుల్లో కూడా ఈ ప్యాకెట్లు దర్జాగా లభ్యమవుతున్నాయి. ఇవేవో పక్క రాష్ట్రం నుంచి వచ్చినవి కాదు. ఈ జిల్లాలో తయారవుతున్నవే.

విజయనగరం, బొబ్బిలి: ఎక్సైజ్‌ శాఖ చేస్తున్న ప్రకటనలకు... అమలవుతున్న తీరుకు ఏమాత్రం పొంతన ఉండట్లేదు. జిల్లాలో మద్యం నియంత్రణ, విచ్చల విడి మద్యాన్ని నియంత్రించేందుకు, సారా విక్రయాలు నిరోధించేందుకు ఎౖసజ్‌ శాఖ గతంలో నవోదయం అన్న కార్యక్రమాన్ని చేపట్టినా పెద్దగా ఫలితాలు రాలేదు. ఇప్పుడు జాగృతి అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. అయినా మద్యం వ్యాపా రం జోరుగా సాగుతోంది. అమ్మకాలు సైతం గతేడాది కన్నా 30 నుంచి 50 శాతానికి పెరిగిపోయా యి. మరోవైపు సారా ప్యాకెట్ల తయారీ యథేచ్ఛగా సాగుతోంది. వాటిని విచ్చలవిడిగా పట్టణాలు, గ్రామాలన్న తేడా లేకుండా సరఫరా చేసేస్తున్నా రు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 210 మద్యం దుకాణా లు, 28 బార్లు ద్వారా ప్రతీ నెలా సుమారు రూ. 60 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోంది. రోజూ రూ.2కోట్ల నుంచి రూ. 4 కోట్ల మద్యం విక్రయాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి పరిధిలోనే గ్రామాల్లోని బెల్ట్‌ షాపులకు మద్యం సరఫరా అవుతోంది. ఇప్పుడవి పట్టణాలకూ పాకి మద్యం వరదలవుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల వేళ ముందస్తుగా మద్యాన్ని దిగుమతి చేసుకునే ప్రణాళికలు రచిస్తున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

సెన్సిటివ్‌ షాపులు గుర్తింపు
జిల్లాలో అత్యధికంగా మద్యం నియంత్రణ లేకుం డా విక్రయిస్తున్న షాపులను ఎక్సైజ్‌ అధికారులే స్వయంగా గుర్తించారు. ఈ ఏడాది 30 శాతం అమ్మకాలు దాటిన షాపులనూ, గతేడాది అమ్మకాల కన్నా 50  శాతం అమ్మకాలు దాటిపోయిన షాపులనూ గుర్తించారు. వీటికి సెన్సిటివ్‌ షాపులుగా నిర్థారించారు. ఎన్నికలు రానున్న నేపథ్యం లో ఎక్సైజ్‌ అధికారులకు ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన సూచనల ప్రకారం ఎక్సైజ్‌ అధికారులు వీటిని ఇలా గుర్తించారు. ఎన్ని గుర్తింపులున్నా అమ్మకాలు మాత్రం యథేచ్ఛగా సాగిపోతున్నాయి.

బ్రాండ్‌ మిక్సింగ్, డైల్యూషన్స్‌కు తూట్లు
జిల్లాలోని పలు మద్యం దుకాణాల్లో నిత్యం బ్రాండ్‌ మిక్సింగ్‌ జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. మద్యం దుకాణాల వద్ద మందుబాబులు కొనుగోలు చేసిన సరుకు బాగా లేదనే గొడవలు కూడా అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి. వీటిపై గతంలో అదనపు బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర స్థాయి అధికారి మద్యం లైసెన్స్‌ దుకాణాల్లో లూజు విక్రయాలు, బ్రాండ్‌ మిక్సింగ్, డైల్యూషన్స్‌ను అరికట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే అమలు చేయాలని మూడు నెలల క్రిందట  ఉత్తర్వులు జారీ చేసి ఎక్సైజ్‌ కార్యాలయాలకు పంపారు.

బ్రాండ్‌ మిక్సింగ్‌తో వినియోగదారులు మోస పోవడంతో పాటు ఎక్సైజ్‌ ఆదాయం గణనీయంగా తగ్గిపోతోందని గుర్తించిన ఆ అధికారి గట్టిగా వార్నింగ్‌లు ఇచ్చి వెంటనే దుకాణాల లైసెన్సులను క్యాన్సిల్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారుల దాడులను కొద్ది రోజులు కొనసాగించినా ఆ తరువాత మళ్లీ మొదటికొచ్చిందని మందుబాబులు మండిపడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మద్యాన్ని ఇక్కడి సీసాల్లోకి బ్రాందీ షాపుల్లో దినసరి కూలీలుగా పనిచేసే వ్యక్తుల చేత మార్పించే ప్రక్రియ నడుస్తున్నదని నేటికీ ఆరోపణలు వస్తున్నాయి.

సెన్సిటివ్‌ షాపులుగా గుర్తించాం.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మద్యం విచ్చలవిడిగా విక్రయించే షాపులను గుర్తించాం. ఈ ఏడాది 30 శాతం మద్యం విక్రయాలు దాటిన వాటిని గతేడాది విక్రయాలకన్నా 50 శాతం మించిపోయిన వాటిని సెన్సిటివ్‌ షాపులుగా గుర్తించాం. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నిత్యం రికార్డులు పరిశీలిస్తున్నాం. బెల్ట్‌షాపులు, ముందస్తు మద్యం దిగుమతికి అవకాశమే లేదు.
– కరణం సురేష్,ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్, బొబ్బిలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement