సాక్షి ప్రతినిధి,విజయనగరం : జిల్లాలోని పార్వతీపురం ఎక్సైజ్ డివిజన్‌లో మద్యం సిండికేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అమాంతం ధరలు పెంచేసి మందుబాబులను దోచుకుంటున్నారు. వీరికి తెలుగు తమ్ముళ్ల సహకారం అందించడంతో అడ్డే లేకుండా పోతోంది. ఎవరికి అందాల్సిన ముడుపులు వారికి అందడంతో గరిష్ట చిల్లర ధర ను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో మద్యం సిండికేట్లు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. జిల్లాలోని పార్వతీపురం డివిజన్‌లో ఒకటి రెండు ఏరియాలు మినహాయించి ఎంఆర్‌పీకి మద్యం విక్రయించడం మానేశారు. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.15 పెంచి విక్రయిస్తున్నారు. పార్వతీపురం డివిజన్‌లో మొత్తం 80 మద్యం షాపులున్నాయి. వీటితో పాటు మరో పది బార్లున్నాయి. వీటిలో వేలాది కేసుల మద్యం, బీర్ల అమ్మకాలు సాగుతున్నాయి. అత్యధిక షాపుల్లోనూ ఇలా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయాలు సాగుతున్నాయి.
ఈ ప్రాంతంలో క్వార్టర్ బాటిళ్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. ఒక్కొక్క బాటిల్‌పై పది రూపాయలకు తక్కువ కాకుండా రేటు పెంచి విక్రయిస్తూ మద్యం సిండికేట్లు లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. తెలుగు తమ్ముళ్లు సహకారం ఉండడంతో సిండికేట్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. ఎక్సైజ్ సిబ్బందికి కొన్ని సూచనలు వెళ్లాయనీ బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. మేం చూసీ చూడనట్టు వ్యవహరిస్తాం....మీరు కూడా అలానే ఉండాలని చెప్పారని తెలిసింది. ఈ డీల్‌లో లక్షలాది రూపాయల చేతులు మారాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎంసీ విస్కీ, ఎం హెచ్ రకాలను క్వార్టర్ బాటిల్ అసలు ధర రూ110 కాగా, దీనిని రూ 120కు విక్రయిస్తున్నారు. ఏసీ ప్రీమియం కూడా రూ115 నుంచి రూ.120 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇదే తరహా మిగతా రకాలకు క్వార్టర్ బాటిళ్లపై పది నుంచి పదిహేను రూపాయలు పెంచి విక్రయిస్తున్నారు. ఇక హాఫ్, ఫుల్ బాటిళ్లనూ అధిక ధరలకు విక్రయించడంతో మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు.
విచ్చలవిడిగా బెల్ట్ షాపులు
ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ప్రధాన మద్యం షాపుల నుంచి సరుకు సమీప గ్రామాలకు తరలుతోంది. అయితే ఈ తరలింపులో బెల్ట్ షాపు నిర్వహకులు, మద్యం షాపుల యజమానులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలోలా బల్క్ స్టాక్ తీసుకువెళ్లకుండా ఏ రోజుకారోజు అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా స్టాకును చిన్న చిన్న సంచుల్లోకి తీసుకువెళ్లి సరుకు పూర్తి కాగానే, మర్నాడు మళ్లీ అవసరం మేరకు తరలిస్తున్నారు. నిఘా ఉంచాల్సిన అధికారులు కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు అందితే దాడులకు వెళ్లే ముందే ఆయా ఇళ్లకు సమాచారం అందించడంతో అసలే తక్కువ సరుకు కావడంతో వారు అప్రమత్తమైపోతున్నారు.
మస్తుగా దోపిడీ !
Published Sun, Nov 16 2014 3:03 AM | Last Updated on Thu, Jul 11 2019 8:44 PM
Advertisement
Advertisement