ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు ‘అదనపు’ పని
పేరుకు కానిస్టేబుళ్లు.. చేస్తున్న పని
మద్యం అమ్మడం
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 14 గంటలపాటు విధులు
మందుబాబుల దుర్భాషలతో ఇబ్బందులు
విజయనగరం రూరల్ : ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణతో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రోజులో 12 గంటలపాటు విధులు నిర్వర్తించడమే కాకుండా.. రికార్డుల నిర్వహణతో అదనంగా మరో రెండుగంటలు కేటాయించాల్సి వస్తోంది. దీంతో వారు పనిభారంతో ఒత్తిడికి గురవుతున్నారు. కుటుంబాలకు దూరమవుతున్నారు. దీంతోపాటు మందుబాబులు పూటుగా తాగివచ్చి ఎక్సైజ్ కానిస్టేబుళ్లు అన్న భావనే లేకుండా అగౌరవంగా మాట్లాడం, దుర్భాషలాడటంతో వీరు మరింత ఆవేదనకు లోనవుతున్నారు. ఇటీవల ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఔట్‌సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించడానికి దరఖాస్తులు ఆహ్వానించినా.. మార్గదర్శకాలు రూపొందించలేదన్న కారణంతో వారి నియామకాలను నిలిపేశారు.
దీంతో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు వారు చేయాల్సిన డ్యూటీలకు బదులు మద్యం దుకాణాల్లోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. వీరి బాధలను ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వ నిర్ణయం కావడంతో వారు సైతం కక్కలేక మింగలేని పరిస్థితిలో ఉన్నారు. 2015-17 సంవత్సరానికి ప్రభుత్వం నూతన మద్యం విధానం ఖరారు చేస్తూ, 10 శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 202 మద్యం దుకాణాల్లో 20 మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులే నిర్వహించుకోవాల్సి వచ్చింది.
అయితే మద్యం విధానం ఖరారై మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సిబ్బందిని నియమించలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా 20 మద్యం దుకాణాల్లో 80 మంది కానిస్టేబుళ్లు రెండు విడతల్లో విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుళ్లు తక్కువగా ఉన్న స్టేషన్ల పరిధిలో ఇద్దరే 14 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నారు. విజయనగరం స్టేషన్-1 పరిధిలో రెండు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే స్టేషన్‌లో ఒక ఎక్సైజ్ సీఐ, ఎస్సై, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు కావడంతో వారిని మద్యం దుకాణాల్లో విధులకు పంపించలేని పరిస్థితి.
దీంతో రెండు మద్యం దుకాణాల్లో నలుగురు కానిస్టేబుళ్లు.. ఇద్దరు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వారిపై పనిభారం, ఒత్తిడి పడుతోంది. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహించడమే కాకుండా.. రాత్రి పది తర్వాత రికార్డుల నిర్వహణ, అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సరిచూడడానికి మరో రెండు గంటలు ఉండాల్సి వస్తోంది. వీటితోపాటు దుకాణాలకు మద్యం కేసులు తీసుకువెళ్లడం, విక్రయాలు సాగించడం, రోజూ వారీ అమ్మకాల ద్వారా వచ్చిన నగదును డీడీ తీసి బ్యాంకుల్లో జమ చేయడం ఎక్సైజ్‌శాఖ సిబ్బందికి మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
లెక్కల్లో తేడా వస్తే చేతిచమురే..
లెక్కల్లో ఎక్కడైనా తేడాలు వచ్చినా విధుల్లో ఉన్న సిబ్బంది చేతిచమురు వదులుతోంది. ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు మద్యం దుకాణాల నిర్వహణ కొత్తకావడ ం.. దీనికితోడు గ్రామాల్లో మందుబాబులతో గొడవలు వారిని మరింత ఆవేదనకు గురి చేస్తున్నాయి. అలాగే కొన్ని దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌లు లేక మందుబాబులు కొనుగోలు చేసిన దుకాణం వద్దే మద్యం తాగి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అసలు పనికి ఎసరు
జిల్లాలో ఈ విధంగా 20 మద్యం దుకాణాల్లో 80 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించడంతో.. అసలు విధులకొచ్చేసరికి సిబ్బంది కొరత ఏర్పడుతోంది. సిబ్బంది లేకపోవడంతో అధికారులు బెల్టు దుకాణాలపై కన్నెత్తి చూడలేని పరిస్థితి నెలకొంది.
హతవిధీ.. ఉద్యోగం మారింది!
Published Sat, Sep 26 2015 12:30 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement