‘ఏం తమాషాలు చేస్తున్నారా? త్రాగునీరు ఆపడం దుర్మార్గమైన చర్య’ అంటూ కలెక్టర్ ఆరుణ్‌కుమార్ శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పురుషోత్తపట్నం (సీతానగరం) : ‘ఏం తమాషాలు చేస్తున్నారా? త్రాగునీరు ఆపడం దుర్మార్గమైన చర్య’ అంటూ కలెక్టర్ ఆరుణ్‌కుమార్ శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న నేమాల శ్రీనివాసరెడ్డికి ఎక్స్‌గ్రేషియా అందించాలని, నాలుగు నెలల జీతాలు తక్షణమే ఇవ్వాలని, మరికొన్ని డిమాండ్‌లతో నాలుగు రోజులుగా సిబ్బంది సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఏఐటీయూసీ యూనియన్ వారు ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు ప్రయత్నించగా సీఐటీయూ వారు అడ్డుకోవడంతో ప్రాజెక్ట్ నిలిచిపోయింది.
శుక్రవారం ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ఎల్ అండ్ టీ అధికారులు చర్చించారు. కాగా వారి ద్వారా ప్రాజెక్ట్ నుంచి నీటిని శనివారం జీరోఅవర్స్‌లో విడుదల చేయడానికి ప్రయత్నించడంతో సీఐటీయూ అడ్డుకుంది. సమాచారం అందుకున్న కలెక్టర్ శనివారం సాయంతం ప్రాజెక్ట్ వద్దకు వచ్చారు. 216 గ్రామాలకు నీటి విడుదల ఆపడం తమాషాగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై సెక్షన్ 107 అమలు చేసి, తక్షణమే తొలగించాలని సీతానగరం తహశీల్దార్ చంద్రశేఖర్‌కు సూచించారు. ఏఐటీయూసీ యూనియన్ వారితో ప్రాజెక్ట్ మోటార్లు ఆన్ చేయించి అక్కడ నుంచి వెళ్లారు.
అక్టోబర్ 3న సమావేశం
కాగా సీఐటీయూ యూనియన్ నాయకులు, కార్మికులు, ఆర్‌డబ్ల్యూఎస్, ఎల్‌అండ్‌టీ అధికారులు ప్రాజెక్ట్ వద్ద సమావేశం అయ్యారు. సీఐటీయూ డిమాండ్‌లపై చర్చించడానికి అక్టోబర్ 3న రాజమండ్రి ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ లక్ష్మీపతిరావు, రంపచోడవరం డీఈలు జనార్దనరావు, పద్మనాభం, జేఈ రామారావు, రాజమండ్రి ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రమేష్, ఏఈఈ శ్రీనివాస్, ఎల్‌అండ్‌టీ అధికారులు పాల్గొన్నారు.