
చంద్రపాలన ఇకలోకల్
సీఎస్ ఆఫీస్‌గా కలెక్టర్ క్యాంపు కార్యాలయం
మిగిలిన శాఖలూ నగరానికి.. కేబినెట్, ప్రభుత్వ శాఖల సమీక్షలు ఇక్కడే
విజయవాడ బ్యూరో : అతి త్వరలో నగరం నుంచే పరిపాలన కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉన్నత స్థాయి సమీక్షలు, కేబినెట్ సమావేశాలు, ప్రముఖులతో భేటీలు.. వీటన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు. దీనికనుగుణంగా ప్రభుత్వంలోని కీలక యంత్రాంగం నగరంలో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటుచేసుకుంటోంది. సూర్యారావుపేటలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు క్యాంప్ ఆఫీసుగా మారనుంది. గతంలోనే ఈ కార్యాలయాన్ని తన క్యాంపుగా మార్చుకుంటానని ప్రధాన కార్యదర్శి కలెక్టర్‌కు చెప్పడంతో ఆయన వేరే చోట క్యాంపు కార్యాలయాన్ని చూసుకుంటున్నారు. దీనిపై సోమవారం హైదరాబాద్‌లో నిర్ణయం జరగడంతో ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయం ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. వారంలో మూడు, నాలుగు రోజులు ఇక్కడే ఉంటానని ముఖ్యమంత్రి చాలాకాలం నుంచి చెబుతున్నారు.
ఇందుకోసం జలవనరుల శాఖ ప్రాంగణంలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకుని తరచు నగరానికి వస్తూ అక్కడే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అందులోనే జరిగింది. ఈ కార్యాలయానికి అందుబాటులో ఉండే విధంగా సీఎస్ కృష్ణారావు సమీపంలోనే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకుంటున్నారు. ఆయనతోపాటు పలువురు ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల కమిషనర్లు సైతం నగరంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకోనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే డీజీపీ క్యాంపు కార్యాలయం కూడా సిద్ధమైంది. రోజుల వ్యవధిలోనే ఈ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బందిని నియమించి పనిచేయడానికి అనువుగా మార్చడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సీఎంతోపాటు వీరంతా ఇక్కడే ఉండి పరిపాలన వ్యవహారాలు నిర్వహిస్తారు.
తాత్కాలిక సచివాలయం?
ముఖ్యమంత్రి, అత్యున్నత అధికార యంత్రాంగం ఇక్కడి నుంచే పనిచేస్తున్న నేపథ్యంలో తాత్కాలిక సచివాలయాన్ని కూడా నగరంలో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కీలక సమావేశాలన్నీ ఇక్కడే జరిగినప్పుడు అందుకనుగుణంగా ఫైళ్లు క్లియర్ చేసేందుకు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తాత్కాలిక సచివాలయంగా మార్చే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. కొన్ని సెక్షన్లను ఇక్కడకు తరలించాలనే యోచన ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉందని దీనిపై ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతున్నారు.
అయితే ఇది సాధ్యమయ్యే పనికాదనే వాదనా వినిపిస్తోంది. కానీ ప్రొటోకాల్ విధులు, కీలక కార్యక్రమాలు నిర్వహించే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) త్వరలోనే నగరంలో ఏర్పాటుకానుంది. సేట్ గెస్ట్‌హౌస్‌లో జీఏడీ క్యాంపు కార్యాలయం ఏర్పాటుకావడం దాదాపు ఖాయమైంది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ఈ నెల 15 నఆర్టీసీ ఎండీ కార్యాలయం ప్రారంభం కానుంది.
దీంతోపాటు కీలక శాఖలను గుంటూరు, విజయవాడకు తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్న విషయం తెలిసిందే. తొలి విడత ఆరు నుంచి పది శాఖలు తరలివచ్చే అవకాశం ఉంది. ఇందుకవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ఆఘమేఘాల మీద చేస్తోంది. అవసరమైన కార్యాలయాలు, వసతి గృహాలు అన్వేషిస్తోంది. ఈ నెలాఖరు నాటికి తాత్కాలిక పాలనా యంత్రాంగమంతా నగరంలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది.