అదే నా లక్ష్యం.. | Collector laksmikantam talks with Sakshi | Sakshi
Sakshi News home page

అదే నా లక్ష్యం..

Published Thu, May 4 2017 1:16 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

అదే నా లక్ష్యం.. - Sakshi

అదే నా లక్ష్యం..

► సేవలన్నీ సులభంగా... వేగంగా అందిస్తాం
► ఉపాధి హామీ పనులు మరింత వేగవంతం
► దుర్గమ్మ గుడి నుంచి బ్యారేజీ వరకు షాపింగ్‌ మాల్స్‌
► ఇసుక అక్రమ రవాణా చేస్తే క్రిమినల్‌ కేసులు
► ఫెర్రీ పవిత్ర సంగమం వద్ద ఆలయం
► ‘సాక్షి’తో కలెక్టర్‌ లక్ష్మీకాంతం


‘జిల్లా ప్రజలందరూ సంతోషంగా ఉండటమే నా లక్ష్యం. అన్ని రకాల సేవలను ప్రజలకు సులభంగా, వేగంగా అందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందడుగు వేస్తున్నా. వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి సారిస్తాను. రాష్ట్రంతోపాటు దేశంలో అన్ని విధాలుగా జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. ఇందుకు అందరి సహకారం అవసరం.

విజయవాడలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటాను...’ అని కలెక్టర్‌ బాలయ్యనాయుడు లక్ష్మీకాంతం చెప్పారు. సక్రమంగా పని చేయని అధికారులను దారిలో పెట్టేందుకు కలెక్టర్‌ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన వారంలోనే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతంతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...   

సాక్షి : ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తారు ..?
కలెక్టర్‌ : జన్మభూమి, మీ కోసం కార్యక్రమాల ద్వారా వేలాది దరఖాస్తులు వచ్చాయి. వస్తున్నాయి. నేను కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే నాటికి 20 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రెవెన్యూ, పౌరసరఫరాలకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. వారం రోజుల వ్యవధిలో ఈ అర్జీలపై దృష్టిసారించి 20 వేలు ఉన్న అర్జీల సంఖ్యను 8వేలకు తగ్గించగలిగాం. సోమవారం నుంచి కలెక్టరేట్‌లోని ఏడు సెక్షన్ల సూపరింటెండెంట్లతో పిటీషన్‌ ఆడిటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం.

రోజు మధ్యాహ్నం సూపరింటెం డెంట్లు వచ్చిన దరఖాస్తులు,పరిష్కారమయ్యాయా.. లేదా.. అర్జీదాఖలు చేసిన వ్యక్తి సంతృప్తికరంగా ఉన్నారా.. లేదా.. అనే విషయాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో ఖాళీగా ఉన్న అధికారుల పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే సీఎంను కోరాను. వేలిముద్రలు పడలేదని ఎవరికీ పింఛన్లు ఆపే పరిస్థితి ఇక నుంచి ఉండదు.

సాక్షి : ప్రజల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుస్తారా..?
కలెక్టర్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో రోజుకు 1.35 లక్షల మంది పని చేస్తున్నారు. కృష్ణా జిల్లా చరిత్రలోనే ఇది ఓ రికార్డు. ఇంత మందికి ఒకరోజు పని కల్పించడానికి చర్యలు తీసుకుంటే జీవితం ధన్యమైనట్లే. అంగన్‌వాడీ, పంచాయతీ, మహిళా ప్రగతి భవనాలను ఉపాధి హామీ పథకం ద్వారానే నిర్మిస్తాం.

సాక్షి : వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్‌ : జిల్లాలో తాగునీటి కొరత ఉన్న ప్రదేశాలను గుర్తించాం.  ఖర్చుకు వెనకాడకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని చెప్పాం. తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రతి రోజు పది నిమిషాలు అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాం.

సాక్షి : జల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
కలెక్టర్‌ : నీరు–ప్రగతి పథకం ద్వారా జల సంరక్షణపై దృష్టిసారించాను. ఇప్పటి వరకు చేసిన పనులు, చేయాల్సిన పనులను గుర్తిస్తున్నాం. అవసరమైన ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, చెరువుల తవ్వకంపై దృష్టిసారిస్తాం. గొలుసుకట్టు చెరువులను తవ్వి నీటి నిల్వను పెంచేందుకు 90 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించాం.

ప్రతి గ్రామంలో జల వినియోగం, భూగర్భజలాల నిల్వలపై ఇద్దరు విద్యార్థులతో అధ్యయనం చేయిస్తాం.  ఖరీఫ్‌ సీజన్‌కు సాధ్యమైనంత త్వరగానే సాగునీటిని విడుదల చేయాలని ఆలోచిస్తున్నాం. ఆధునికీకరణ పనుల పైనా దృష్టిసారిస్తా. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తా. ఉద్యానపంటల సాగును మరింతగా పెంచి జిల్లా ఆదాయాన్ని వృద్ధి చేసేందుకు కృషి చేస్తాను.

సాక్షి : ఇసుక అక్రమ రవాణాపై ఎలాంటి చర్యలు చేపడతారు ?
కలెక్టర్‌ : జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇప్పటికే ఎస్పీ, డీఎస్పీలతో మాట్లాడాను. ఇసుక రేవులను ఆక్రమించుకుని వ్యాపారం చేయాలని చూస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశా. ఇసుకరేవుల వద్ద సీసీ కెమెరాలను పెట్టి నిఘా ఉంచుతాం. ఇసుక రేవులు ఉన్న గ్రామాల్లో ఎంపిక చేసిన వారితో నిఘా బృందాలను ఏర్పాటు చేస్తాం.

సాక్షి : జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటీ ?
కలెక్టర్‌ : మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి అభివృద్ధి, పోర్టు నిర్మాణం చేపట్టి బందరును పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ముఖ్యమైనవి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధి, విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఫ్‌లై ఓవర్‌ నిర్మాణ పనులు ప్రారంభించడం దుర్గగుడి ఫ్‌లై ఓవర్‌ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడంపై ప్రధానంగా దృష్టిసారించాం.

మెట్రో లైన్‌ నిర్మాణానికి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేశాం. దుర్గగుడి నుంచి ప్రకాశం బ్యారేజీ, పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వరకు షాపింగ్‌ మాల్స్‌ను నిర్మించే ఆలోచన చేస్తున్నాం. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఒక ఆలయాన్ని నిర్మించి అధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా చేయాలని ఆలోచన చేస్తున్నాం.                       
                         
అర్జీదారులకే ఫోన్‌..
మీ కోసం, జన్మభూమి, ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు ప్రతి రోజూ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తాం. నేరుగా అర్జీదారులకు నేను ఫోన్‌ చేసి మీ పరిష్కారమైందా.. లేదా.. అధికారులు స్పందించిన తీరుపై మీరు సంతృప్తి చెందారా.. అని ఆరా తీస్తా. అర్జీదారులు సంతృప్తికరంగా లేకపోతే మళ్లీ నన్ను నేరుగా కలవొచ్చు.     

‘స్వీకారం’తో విద్యాభివృద్ధికి కృషి
నేను అనంతపురం జేసీగా పనిచేసే సమయంలో ‘స్వీకారం’ కార్యక్రమానికి రూపకల్పన చేశాను. ఈ కార్యక్రమం నా మానస పుత్రిక. పేద విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఇక్కడా అమలు చేస్తాను. ప్రతి వసతిగృహంలోనూ కనీస వసతులు కల్పించి విద్యార్థులు మంచి వాతావరణంలో చదువుకోవాలనేది ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. జూన్‌ 12వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నేను కూడా ఒక హాస్టల్‌ను దత్తత తీసుకుంటా.    

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement