తండ్రి కోరికను కాదనుకుండా... | Collector Muralidhar Reddy Special Chit Chat in Sakshi | Sakshi
Sakshi News home page

పితృవాక్య పాలకుడు

Published Fri, Jun 14 2019 11:32 AM | Last Updated on Fri, Jun 14 2019 11:37 AM

Collector Muralidhar Reddy Special Chit Chat in Sakshi

తల్లిదండ్రులు, భార్యాబిడ్డలతో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

నాకు ఇంజినీరింగ్‌ అంటే ఇష్టం. మా నాన్నకు ప్రజలకు సేవ చేసే ఉద్యోగం అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన తన జీవిత కాలమంతా ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఇంజినీర్‌గా పని చేశారు. అదంతా రొటీన్‌. పరిపాలనా విభాగాల్లో ఉద్యోగం చేస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు కొంతయినా సేవ చేసే భాగ్యం కలుగుతుందనే భావన ఆయనది. నా ఇష్టాన్ని, నాన్న ఆశయాన్ని కలగలిపి నా జీవన పయనం సాగిస్తున్నాను. ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి.. తరువాత గ్రూప్‌–1 పరీక్ష రాసి తొలిసారి ఆర్డీఓగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాను.

తరువాత వివిధ జిల్లాల్లో పలు బాధ్యతలు నిర్వర్తిస్తూ.. తొలిసారిగా ఇంత పెద్ద జిల్లాకు కలెక్టర్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అన్ని సమస్యలూ కలగలిపిన జిల్లా ఇది. అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ అందరికీ అభివృద్ధి ఫలాలను అందించాలి. కార్యాలయంలో కూర్చొని మిగిలిన వారిపై గద్దిస్తే సరిపోదు. ప్రజాక్షేత్రంలో ఉంటూ ‘రండి పని చేద్దాం’ అని పిలుపునిచ్చే మనస్తత్వం నాది. ఆ దిశగానే అడుగులు వేస్తూ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలల పంటయిన నవరత్నాలను విజయవంతంగా అమలు చేయడం నా ముందున్న ప్రథమ కర్తవ్యం.

‘సాక్షి’తో జిల్లా నూతన కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి :తండ్రే ఆయనకు స్ఫూర్తి. వృత్తిలో ఒడిదొడుకులు సహజం. బాధ కలిగినా, సంతోషం కలిగినా ఎక్కువగా రియాక్ట్‌  కాకూడదనే తన తండ్రి సిద్ధాంతాన్ని విశ్వసించారు. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే అదే సక్సెస్‌ను తెచ్చి పెడుతుందనే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. టెక్నాలజీలో ముందుకు వెళ్దామనుకున్నారు. తండ్రి మాత్రం ప్రజలకు సేవచేసే ఉద్యోగం సంపాదించాలన్నారు. తన ఆసక్తిని పక్కన పెట్టకుండా, తండ్రి కోరికను కాదనుకుండా నొప్పింపక తానొవ్వక అన్నట్టు అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసులో చేరి వృత్తికి సాంకేతికతను జోడించి ముందుకు వెళ్తున్నారు. ఆయనే మన కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి. బాల్యం నుంచి కలెక్టర్‌ పదవి వరకు తన ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ప్రతిష్టాత్మకమైన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా తన ప్రాధాన్య అంశాలను వివరించారు.

స్వస్థలం, చదువు..
మాది కర్నూలు జిల్లా పాణ్యం మండలం బలపనూరు గ్రామం. బాల్యం వివిధ ప్రాంతాల్లో గడిచింది. ఉద్యోగ రీత్యా మా తండ్రి గారు ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో పనిచేయడం వల్ల తిరగాల్సి వచ్చేది.  స్వగ్రామమైన బలపనూరులోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేశాను. ఏడో తరగతి వరకు అక్కడే చదివాను. తర్వాత కర్నూలులో పదో తరగతి వరకు చదివాను. ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) గుంటూరులోని విజ్ఞాన్‌ కళాశాలలో, కర్నూల్‌లో పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్, తిరుపతిలోని ఎస్‌వీ యూనివర్సిటీలో ఎంటెక్‌ చేశాను.

కుటుంబ నేపథ్యం..
మాతండ్రి పేరు రవికుమార్‌రెడ్డి, తల్లి శ్యామల. మా నాన్న గారు ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. ఏఈగా బాధ్యతలు ప్రారంభించి ఈఈ వరకూ ఎదిగి ఉద్యోగ విరమణ చేశారు. నా సతీమణి పేరు హేమ. వారిది కూడా కర్నూలే. పెద్దలు కుదిర్చిన వివాహం మాది. ఆమె ఎమ్మెస్సీ చేశారు. వివాహం తరువాత ఎంబీఏలో డిప్లమో చేశారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు మణిపాల్‌లో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పాప వెల్లూరు బిట్స్‌లో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదువుతోంది.

ఇంజినీరింగ్‌ వైపు వెళ్దామనుకుని.. అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసులోకి..
తండ్రి ఇంజినీర్‌గా పని చేయడంతో నాకు కూడా ఇంజినీర్‌గా స్థిరపడాలని ఉండేది. అందుకే ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో పీజీ చేశాను. నాకేమో ఇంజినీరింగ్‌ వైపు ఆసక్తి. టెక్నికల్‌గా వెళ్దామనుకున్నాను. కానీ మా తండ్రి అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ వైపు వెళ్లాలని కోరుకునేవారు. ప్రజలకు సేవ చేసే సర్వీసులో ఉద్యోగం సంపాదించాలని, పేదల సేవలో ఉండే ఉద్యోగం చేస్తే మనిషికి సంతృప్తి అనేది ఉంటుందని చెప్పేవారు. తొలుత ఇంజినీరింగ్‌ సర్వీస్‌ కోసం ప్రిపేర్‌ అయ్యాను. అలాగని తండ్రి కోరికను కాదనలేకపోయాను. అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసు కోసం ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో భాగంగా 1996లో గ్రూప్‌–1 సర్వీసు వచ్చింది. ఆ తర్వాత ఇటువైపు ఉండిపోయాను. అలాగని అడ్మినిస్ట్రేటివ్‌లోకి వచ్చిన తర్వాత  టెక్నాలజీని ఎక్కడా వదలలేదు. టెక్నాలజీకి దూరం కాలేదు. నా స్టైల్‌ ఆఫ్‌ ఫంక్షన్‌లో కూడా ఎప్పుడూ సాంకేతికత ఉంటుంది. ప్రతి దాంట్లో సాంకేతికతను జోడిస్తాను.

 వృత్తిలో ఆ ఇద్దరే ఆదర్శం
అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసులోకి వచ్చాక ఓ ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌లను ఆదర్శంగా తీసుకున్నాను. మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ కృష్ణయ్య, అగ్రికల్చర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌తో పనిచేసిన అనుభవం ఉంది. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ప్రతి దానిలో వారి ద్వారా స్ఫూర్తి పొందాను. వారిని నేనొక మోడల్‌గా తీసుకునే వాడిని. పనిచేసే చోట ప్రతి అధికారి వద్ద మంచి సంబంధాలు కొనసాగిస్తూ రావడం నాకు ఆయా విభాగాల్లో మంచి సంతృప్తిని ఇచ్చింది.  

ఫస్ట్‌టైమ్‌ కలెక్టర్‌గా ఫీలింగ్‌?
ఒకసారి కలెక్టర్‌గా చేస్తే రాష్ట్రస్థాయి పోస్టుకు వెళ్లే సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. స్వచ్ఛభారత్‌ కమిషన్‌గానీ, ఈజీఎంఎంగానీ, అగ్రికల్చర్‌ కమిషనర్‌ పోస్టులు రాష్ట్రస్థాయి పోస్టులే. కలెక్టర్‌గా చేసి వెళ్లిన తరువాత అన్ని విభాగాలపై ఒక పట్టు అనేది వస్తుంది. మిగిలిన పోస్టులలో ఇంత గుర్తింపు రాదు.

సీఎం జగన్‌ అప్పగించిన బాధ్యతపై..
రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. చాలా మంచి కలెక్టర్లు ఇక్కడ పనిచేశారు. ఇక్కడా చాలా విభిన్నంగా ఉంటుంది. అలాగే రాజకీయంగా కూడా.. ఇలాంటి జిల్లాకు కలెక్టర్‌గా నియమించడం అదృష్టంగా భావిస్తున్నాను.

ప్రాధాన్య అంశాలు
వైద్య, ఆరోగ్యం, విద్య అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇస్తాను.  వైద్యులు ఆస్పత్రుల్లో వారివారి పనులు సక్రమంగా నిర్వర్తిస్తే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. ఖర్చు కూడా చేయాల్సిన పని ఉండదు.  అదే విధంగా ఉపాధ్యాయులు కూడా తమ వృత్తిని సక్రమంగా నిర్వర్తిస్తే ప్రభుత్వ పాఠశాలలు మూతవేయాల్సిన పని ఉండదు.  చాలామంది ఉపాధ్యాయులు సక్రమంగా పాఠశాలలకు వెళ్లడం లేదని తమకు తెలిసిందని, దీనిపై మొదటిసారిగా ప్రత్యేక దృష్టి సారించి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాను. నాకు కావల్సింది నాణ్యమైన విద్య మాత్రమేనని, అంతే తప్ప పర్సంటేజ్‌లో మొదటి స్థానం ఉండడం కాదని జిల్లా విద్యాశాఖాధికారికి చెప్పాను.   

ఏజెన్సీపై ప్రధాన దృష్టి  
నేను శుక్రవారం విధుల్లో చేరాను. శనివారం, ఆదివారం ఏజెన్సీలో గడిపాను. అక్కడ ఉన్న సమస్యలపై ప్రత్యక్షంగా అవగాహన ఉంటుంది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిని అక్కడ పోస్టింగ్‌ వేస్తే అది ఒక శిక్షలా భావిస్తారు. అగ్రికల్చర్‌లో నేను ఉన్నప్పుడు ఏజెన్సీకి వేస్తారంటే మా వాళ్లు ‘వద్దుసార్‌ ట్రైబల్‌ ఏరియా సార్, అక్కడ పీవోలు వదలరు సార్‌’ ఇలా రకరకాలుగా అంటుండేవారు. సీనియర్‌ అధికారులుగా మేమే ముందుగా వెళ్తే మిగిలివారిలో ఆత్మస్థైర్యం వస్తుంది. అంతే కాకుండా మనం ఇక్కడ కూర్చుని వెళ్లండి అంటే బాగుండదు. నేను మా అధికారులకు, డీఎంహెచ్‌వోకు చెప్పేదదే. అక్కడికి వెళ్లండి.. ఒక నైట్‌ అక్కడ ఉండండి అంటుంటాను. డీఎంహెచ్‌వో వెళ్లారనుకోండి, ఆయన నైట్‌ అక్కడ ఉంటే ఆయనతో పాటు వైద్యులంతా అక్కడ ఉంటారు. ఆయన ఉదయం వెళ్లి రాత్రికి వచ్చేస్తే ఆయనతోపాటు తిరిగి డాక్టర్లూ వచ్చేస్తారు.

నాణ్యమైన విద్యావిధానం అవసరం..
నాణ్యమైన విద్య కావాలని అధికారులను కోరుతున్నాను. పిల్లలకు ఏ పరీక్ష పెడుతున్నామో అదే పరీక్షను ఉపాధ్యాయులకు పెడితే ఎంత వరకు విజయవంతం అవుతారో చూడాలని డీఈవోకు వివరించాను. పిల్లలకు పరీక్ష పెట్టిన ఉపాధ్యాయులు, తమ సబ్జెక్టుల్లో ఎలాంటి నిపుణత కలిగి ఉంటారనేది తెలుసుకోవచ్చని అన్నాను. అటువంటప్పుడే మనం కోరుకున్న విద్యను విద్యార్థులకు అందించగలమని అన్నాను. నాకు ఉద్యోగం వచ్చేసింది.. నాకేంటి అనేది ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతిదీ నేర్చుకుంటూ ఉండాలి. టీచర్‌కు ఇది ఇంకా ఎక్కువగా ఉండాలి. ఒక మాడ్యూల్‌ చేయమని డీఈఓకు చెప్పాను. అసోసియేషన్‌ వాళ్లతో కూడా సమావేశం పెట్టమని చెప్పాను. దీనిలో వారికి ఏమైనా సాధకబాధకాలు చెప్పుకోవచ్చు.

ఆస్పత్రులపై దృష్టి సారిస్తా..
జిల్లాలోనూ, ఏజెన్సీ ప్రాంతాల్లోను ఆస్పత్రుల్లో ఉండే సిబ్బంది వివరాలను సేకరిస్తున్నాను. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యులను నియమించడంతో పాటు మెరుగైన వైద్యం అక్కడివారికి అందజేసేలా చర్యలు తీసుకుంటాను. మాతా శిశు మరణాల తగ్గింపునకు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. చింతూరు, రంపచోడవరం ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఉంది. కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకుందామంటే రాజమహేంద్రవరం నుంచి, కాకినాడ నుంచి రంపకు ఫర్వాలేదు కానీ, చింతూరుకు ఇబ్బందే. కొన్ని అంశాలను గుర్తించాము. స్పెషలిస్ట్‌ డాక్టర్లను భద్రాచలం నుంచి చింతూరుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. డాక్టర్లు అందరినీ కాకుండా ఒకసారి డీఎంహెచ్‌వోతో కూర్చుని మాట్లాడి ప్రతి నెలా కాకపోయినా ప్రతి ఆరు నెలలకైనా ఏజెన్సీకి వెళ్లాలనే అంశాన్ని పరిశీలిస్తున్నాను. రొటేషన్‌ పద్థతిలో ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యులు పని చేసేలా చర్యలు చేపడతాను.

బాల్యంలో సంతోషపడిన,బాధపడిన ఘటనలు..
కుటుంబపరంగా కానీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యలో ఎక్కువ అంచనాలు ఉన్నవారు బాధపడతారు. నా సామర్థ్యాన్ని బట్టి నేను పనిచేయడమే నేర్చుకున్నాను.

ఉత్తమ ర్యాంకులు..!
చదువులో కూడా నేను టాప్‌లో రావాలని ఎప్పుడు అనిపించలేదు. కానీ టాప్‌ ప్లేస్‌లో ఉండేవాడిని. గ్రూప్‌–1లో కూడా సెకండ్‌ ర్యాంక్‌ వచ్చింది.

సినిమాలపై..
సినిమాలంటే ఇష్టం. ఎక్కువగా చూస్తాను. తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తాను. చిన్నప్పుడు సహజంగా ఎన్టీఆర్‌..  తరువాత కమల్‌హాసన్, మాధవన్‌లను.. అభిమానించేవాడిని. ఈ జనరేషన్‌లో ప్రత్యేకంగా ఎవరూ లేరు.

 ఫిట్‌నెస్‌పై..
చిన్నప్పటి నుంచి యాక్టివ్‌ ఫిజికల్‌ లైఫ్‌ నాది. చిన్నపుడు ఎన్‌సీసీ, ఇంటర్మీడియట్‌లో డ్రిల్, తరువాత షటిల్, క్రికెట్, యుక్త వయసులో ఆడే అన్ని క్రీడల్లో పాల్గొనేవాడిని. ప్రత్యేకంగా ఒకటని లేదు. ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడతాను.

పనివేళల్లో పనిచేస్తే చాలు..
ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి ఉద్యోగి తనకు కేటాయించిన విధులను కార్యాలయ పని వేళల్లో సక్రమంగా చేస్తే సరిపోతుంది. తాను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు కలెక్టరేట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటాను.   ఎక్కడ ఏ విభాగంలో అవినీతి జరుగుతున్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చు.

నవరత్నాలే మొదటి ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలే మొదటి ప్రాధాన్యం.  ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేసేందుకు కృషి చేస్తాను. పేద వర్గాల సంక్షేమమే ప్రధాన ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్న పథకాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటే వాటిని నేరుగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే.  వీటిలో ఏవిధమైన నిర్లక్ష్యం సహించను.

వ్యవసాయంలో కొత్త విధానాలకు శ్రీకారం
జిల్లాలో 4 లక్షలకు పైగా హెక్టార్లలో సాగు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మిగిలిన జిల్లాల కన్నా తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ రంగంలో సమస్యలు తక్కువగా ఉంటాయి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు పంటను విక్రయించుకునేలా ప్రత్యేక మార్కెటింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. రైతు ఆదాయాన్ని పెంచేలా పంట ఉత్పత్తులు ఉండాలి. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జీరో బేస్‌డ్‌ బడ్జెట్‌ కింద ప్రకృతి వ్యవసాయం చేయడంపై దృష్టి పెడతా. ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులు పండించిన పంట బయటకు తీసుకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ప్రాంతాల్లో మినీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఎక్కువగా పెట్టాల్సి ఉంది. అదే విధంగా ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతాం.

పోలవరం సమస్యలు పరిష్కరిస్తా
పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా అర్హులై ఉండి ప్రభుత్వ సాయం అందకపోతే తప్పకుండా పరిశీలిస్తాం. ఏజెన్సీలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద భూములు కోల్పోయిన వారికి మంచి భవనాలను కట్టించి ఇస్తాం.

రంగం మారడం వల్ల నిరాశచెందారా?
అదేంలేదు. నేను ఆర్డీవో స్థాయి నుంచీ సాంకేతికతను వినియోగిస్తూ వస్తున్నాను. ఏ బాధ్యతలు చేపట్టినా సంతృప్తిగానే చేశాను. అనంతపురంలో శిక్షణ అయిన తర్వాత గద్వాల్‌ ఆర్డీవోగా మొదటి పోస్టింగ్‌ వచ్చింది. ఆ తర్వాత విజయనగరం ఆర్డీవోగా, అక్కడే హౌసింగ్‌ పీడీ చేశాను. అనంతరం వైద్య, ఆరోగ్య మంత్రి అరుణ వద్ద పీఏగా వెళ్లాను. మాకు పదోన్నతి వచ్చే సమయంలో హైదరాబాద్‌లో ఆర్కియాలజీ మ్యూజియంలో తక్కువ సమయం పనిచేశాను. అనంతరం భద్రాచలం దేవస్థానం ఈవోగా పనిచేశాను. అక్కడి నుంచి విజయనగరం డీఆర్‌డీఏ పీడీగా బదిలీ అయ్యాను. తర్వాత వుడా కార్యదర్శిగా, జీవీఎంసీ అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేశాను. అక్కడి నుంచి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బదిలీ అయింది. తదుపరి  కృష్ణా జిల్లాలో అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశాను. ఐఏఎస్‌గా పదోన్నతి వచ్చాక కాకినాడ పోర్ట్‌ డైరెక్టర్‌గా వచ్చాను. తర్వాత గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌గా, ఈజీఎంఎం సీఈవోగా పనిచేశాను. రాష్ట్ర విభజన తర్వాత స్వచ్ఛ భారత్‌ మిషన్‌ మొదటి ఎండీగా చేశాను. ఈ పోస్టులో ఉండగా వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రతిచోటా సంతృప్తికరంగానే విధులు నిర్వహించాను. అసంతృప్తి అనేది లేదు.

తండ్రే స్ఫూర్తి..
నా తండ్రినే స్పూర్తిగా తీసుకున్నాను. ఏ ఉద్యోగికైనా వృత్తిలో ఒడుదొడుకులు సహజమని, అటువంటప్పుడు ఏ సవాల్‌ ఎదురైనా బాధపడకూడదనే విషయాన్ని తండ్రి రవికుమార్‌రెడ్డి నుంచి నేర్చుకున్నాను. మా తండ్రి నీటిపారుదల విభాగంలో చిన్న ఉద్యోగం చేసినప్పటికీ ఎన్నో ఒడుదొడుకులు వస్తున్నా, వాటిని పట్టించుకోకుండా వృత్తిలో మమేకమై పని చేస్తుండేవారు. తనకు బాధకలిగినా, సంతోషం కలిగిన ఎక్కువగా స్పందించేవారుకాదు. బ్యాలెన్స్‌డ్‌గా ఉండేవారు. నేనూ అలాగే ఉండాలనుకునేవాడిని. ఆయనే నాకు స్ఫూర్తి. ఆయనలా పని చేయాలనే సంకల్పం మొదటి నుంచీ ఉంది.

కలెక్టర్‌         :  డి.మురళీధర్‌ రెడ్డి
తల్లిదండ్రులు   :   రవికుమార్‌రెడ్డి, శ్యామల
స్వస్థలం         :  బలపనూరు, కర్నూలు జిల్లా
భార్య          :  హేమ
పిల్లలు         :  నిఖిత్, రచన  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement