మండల కేంద్రం దేవరాపల్లిలో జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఆకస్మికంగా వచ్చిన ఆయన సుమారు మూడున్నర గంటలపాటు మండలంలో పర్యటించారు.
దేవరాపల్లి పీహెచ్‌సీ తనిఖీ
తహశీల్దార్ కార్యాలయంలో వినతుల స్వీకరణ
రైవాడ జలాశయం పరిశీలన
దేవరాపల్లి : మండల కేంద్రం దేవరాపల్లిలో జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఆకస్మికంగా వచ్చిన ఆయన సుమారు మూడున్నర గంటలపాటు మండలంలో పర్యటించారు. తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పీహెచ్‌సీ సిబ్బంది పనితీరును ఎస్‌పీహెచ్‌వో శాంతిప్రభ, వైద్యాధికారి పి.బిందుమాధవిలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని ప్రతి గదిని తనిఖీ చేశారు. ఓపీ చీట్లు, సిబ్బంది హాజరు పట్టిక, ల్యాబ్ టెక్నీషియన్ రూములో పరీక్షల రికార్డులను పరిశీలించారు. ల్యాబ్ టెక్నీషియన్ విధులకు హాజరైనప్పటికీ హాజరుపట్టికలో ఆమె సంతకం చేయకపోవడంతో కలెక్టర్ స్వయంగా ఆప్సంట్ మార్క్ చేశారు. ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
రోగుల వార్డును పరిశీలించి,అక్కడివారి బాగోగులు, వైద్యసేవల గురించి ఆరా తీశారు. అనంతరం కొత్తగా నిర్మించిన మండల మహిళా సమాఖ్య భవనం, హౌసింగ్ కార్యాలయాల భవనాలను పరిశీలించారు. తహశీల్దార్ కార్యాలయంలో కొద్దిసేపు ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అంబేద్కర్ కాలనీలో సనాసంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న మినరల్ వాటర్‌ప్లాంట్, బయోమెట్రిక్ మరుగుదొడ్ల పనులను పరిశీలించారు. అక్కడి సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. రైవాడ జలాశయాన్ని పరిశీలించిన ఆయన తెనుగుపూడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులతో మాట్లాడి వసతులను, మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వసతి సమస్యను కళాశాల ప్రిన్సిపాల్ బి.సుధాకర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆస్పత్రి నిధులు దుర్వినియోగంపై విచారణకు డిమాండ్ : పీహెచ్‌సీ అభివృద్ధి నిధులు దుర్వినియోగమయ్యాయని,దీనిపై తక్షణం విచారణ చేపట్టాలని సీపీఎం నాయకుడు డి.వెంకన్న కలెక్టర్ యువరాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నెలరోజుల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేశానని.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వచ్చి నామమాత్రంగా విచారణ చేపట్టారన్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆయన డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలను కలెక్టర్‌కు అందజేశారు. అంతకుముందు పీహెచ్‌సీ వద్ద సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. వైద్యఆరోగ్యశాఖ అధికారులతో కాకుండా వేరొకశాఖ అధికారులతో విచారణ చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆయన వెంట తహశీల్దార్ వై.ఎస్.వి.వి.ప్రసాద్, ఎంపీడీవో ఆర్.పూర్ణిమాదేవి ఉన్నారు.