
కొల్లేరు ప్రక్షాళనకు విరామం
ఏలూరు : కొల్లేరు సరస్సు ప్రక్షాళనకు తాతాల్కికంగా బ్రేక్ పడింది. నిడమర్రులో 125 ఎకరాల్లో ఆక్రమణలను సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో గత నెలలో తొలగించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే ఆపరేషన్ కొల్లేరు పేరిట మిగిలిన సరస్సు పరిధిలోని చేపల చెరువుల్ని ధ్వంసం చేసేందుకు కొల్లేరు అభయూరణ్యం అధికారులు కార్యాచరణ రూపొందించారు. అయితే, నిధుల లేమి, మరోపక్క పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై సుప్రీం కోర్టు నుంచి మార్గదర్శకాలు అందకపోవడంతో కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమానికి ఆ శాఖ అధికారులు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.
పరిహారం చెల్లింపే అడ్డంకి
జిరాయితీ భూముల్లో చేపల చెరువులను తొలగించి, ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవాలంటే వాటి యజమానులకు నష్టపరి హారం చెల్లించాల్సి ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం నోరు మెదపటం లేదు. మరోవైపు కొల్లేరులో చేపల చెరువులను ధ్వంసం చేస్తే సాగుదారులు నష్టపోతారని, ఈ విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని గత నెల 10న ఏలూరులో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. భూముల వారీగా సర్వే నంబర్ల వివరాలతో వాస్తవ పరిస్థితులను గుర్తించేందుకు సర్వే చేయూలని మంత్రి ఆదేశించారు. అయితే, ప్రక్షాళన విషయమై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కొల్లేరులో ఆక్రమణల వైపు యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదు.
మత్స్యశాఖ సహకారమేదీ
ఆపరేషన్ కొల్లేరు పేరిట 2006లో జిల్లాలో పెద్దఎత్తున చేపల చెరువుల గట్లను ధ్వంసం చేశారు. ఆ తరువాత దానిని పట్టించుకోవడం మానేశారు. దీంతో పాత చెరువులను అక్రమ సాగుదారులు పునరుద్ధరించారు. పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలోని 7 మండలాల్లో 6వేల ఎకరాలను చెరువులుగా మార్చేసినట్టు అంచనా. ఇందులో ప్రభుత్వం భూ ములు 1,300 ఎకరాలు, జిరాయితీ భూ ములు 4,700 ఎకరాలు ఉన్నట్టు జిల్లా వన్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు. చెరువులు తవ్వడానికి మత్స్యశాఖ నుంచి సాగుదారులు అనుమతులు తీసుకున్నారు. అనుమతి తీసుకున్నది ఒకచోట కాగా, చెరువులు తవ్వింది మరోచోట కావడంతో అనుమతులు ఉన్న చెరువులు ఏవి అనేది స్పష్టం కావడం లేదు. ఈ విషయంలో అటవీ శాఖకు సహాయం అందించాల్సిన మత్య్సశాఖ మొహం చాటేయడం అనుమానాలకు తావిస్తోంది.
నిధుల ఊసెత్తని ప్రభుత్వం
కొల్లేరు వ్యవహారంపై సుప్రీం కోర్టులో 200కు పైగా కేసులు నడుస్తున్నారుు. ఈ నేపథ్యం లోనే కొల్లేరులోని 6వేల ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ కోసం ఆక్రమణలు తొలగించాలన్నా, వాటిని విదేశీ, స్వదేశీ పక్షులకు విడిది కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నా పెద్దఎత్తున నిధులు అవసరం ఉంది. చెరువుల ధ్వంసానికి నిధులివ్వాలని జిల్లా అధికారులు నివేదిక సమర్పించినా ప్రభుత్వం దానిపై ఇంకా దృష్టి సారించలేదు.