దండెత్తి రండి
పట్నంబజారు (గుంటూరు):
తెలుగుదేశం ప్రభుత్వ మోసాలకు వ్యతిరేకంగా, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వచ్చే నెల 16వ తేదీన అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట పార్టీ నిర్వహించే ధర్నాలలో పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీపై చంద్రబాబు ప్రభుత్వం అలంబిస్తున్న నిర్లక్ష్యవైఖరికి ప్రతి ఒక్కరూ దండెత్తి నిరసన తెలపాలన్నారు. దసరా పండగను పురస్కరించుకుని మూడవ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపేందుకు దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
= గుంటూరు అరండల్‌పేటలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. కీలక నేతలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, మునిసిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు.
= మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, అక్టోబరు 3వ తేదీ దసరా పండుగ రోజున వినుకొండ నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
= తెలుగుదేశం పార్టీ నేతలు అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఆ హామీలు నెరవేర్చే వరకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోరుబాట పడుతున్నట్టు పేర్కొన్నారు.
= గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ టీడీపీ ఇచ్చిన హమీలు నె రవేర్చలేకపోవటంతో ఆ పార్టీ కార్యకర్తల్లోనే నిరుత్సాహం నెలకొందన్నారు.
= నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ అతివృష్టి కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం విషయంలో ఇప్పటికీ స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవటం శోచనీయమన్నారు.
= రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయాటానికి అక్టోబర్ 10 నుంచి గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక అధినేత ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీ కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేందుకేనన్నారు.
= రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఓటమి ఒక గెలుపునకు నాంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఎన్నికల అనంతరం నిరుత్సాహంగా ఉన్న కార్యకర్తలు ఇకపై నూతనోత్తేజంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
= మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తే ప్రతిఫలం తప్పక దక్కుతుందన్నారు. గెలుపోటములు సర్వసాధారణమని, ఓటమికి గల కారణాలు అన్వేషించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు చెప్పిన విధంగా అధికారులు నడచుకోవాలని ఆదేశాలివ్వటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
= బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ టీడీపీ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన భాధ్యత వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఉందన్నారు.
= నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత మొదలైందన్నారు.
= గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ భవిష్యత్తు వైఎస్సార్ సీపీదే అనే విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలన్నారు.
= రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అధికారం కోసం లేనిపోని హమీలు ఇచ్చి ప్రజలను వంచించిన టీడీపీ నేతలకు బుధ్ధి చె ప్పేందుకు కార్యకర్తలు సర్వసన్నద్ధులు కావాలన్నారు.
= నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ, మహానేత ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు.
= దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అండగా జననేత జగన్ ఉన్నారని స్పష్టం చేశారు.
= వినుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న టీడీపీపై పోరాటాలకు సిధ్దం కావాలన్నారు. సమావేశంలో ముందుగా టీడీపీ నేతల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
= వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, నన్నపనేని సుధ, ఎండీ నసీర్‌అహ్మద్, నేతలు అన్నాబత్తుని శివకుమార్, గుదిబండి చినవెంకటరెడ్డి, ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, నూతలపాటి హనుమంతరావు, రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), సయ్యద్‌మాబు, కొత్తా చిన్నపరెడ్డి, ఉప్పుటూరి నర్సిరెడ్డి, లోయా తాండవకృష్ణ, ప్రసాదం వాసుదేవ, కొలకలూరి కోటేశ్వరరావు, దర్శనపు శ్రీనివాస్, అత్తోట జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.