అభివృద్ధికి కలసి రండి
ప్రవాస భారతీయ సీఈవోలతో సీఎం
సాక్షి, అమరావతి: రెండంకెల వృద్ధితో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌కు సహకరించాలని అమెరికాలోని భారతీయ సీఈవోలను సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్ర సుస్థిర వృద్ధికోసం వ్యూహాత్మక ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం మూడోరోజు శనివారం శాన్‌ఫ్రాన్సిస్కోలో భారతీయ పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య, సాంకేతిక ప్రముఖులతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సముపార్జిం చిన జ్ఞానాన్ని, అనుభవాన్ని జన్మభూమికి వెచ్చించాలని కోరారు. అనంతరం సిలికానాంధ్ర యూనివర్సిటీని సందర్శించి అక్కడ తెలుగు సంస్కృతి, భాషా సంరక్షణకు చేపట్టిన కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రలో ‘అమరావతి స్కూల్ ఆఫ్ తెలుగు లింగ్విస్టిక్స్’ ఏర్పాటు కోసం రూ.6 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తర్వాత టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ వెళ్లిన సీఎం స్థానిక తెలుగువారినుద్దేశించి మాట్లాడారు. అనంతరం డల్లాస్‌లోని ఉన్న మహాత్ముని విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ..
తదుపరి సీఎం ప్రీమియర్, గ్లోబల్ ఔట్‌లుక్, టెక్‌ప్రోస్ సాప్ట్‌వేర్, ఆర్కస్ టెక్, శ్రీటెక్, మద్ది సాఫ్ట్, గురూస్ ఇన్ఫోటెక్, ఏఈ ఇన్ఫోటెక్, ఆక్టస్ తదితర కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమరావతి, విశాఖ నగరాల్లో లీజు ప్రాతిపదికన స్థలాలు కేటాయిస్తే కార్యకలాపాల నిర్వహణకు యత్నిస్తామని వారు చెప్పారు. సీఎం బృందంతో డెల్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ సత్య కూడా సమావేశమయ్యారు. బెల్ హెలికాప్టర్ కంపెనీ డైరెక్టర్ చాద్ స్పార్క్స్ ఏపీలో మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.