వసూళ్ల రాజాలు | Community Police Officer (CPO) Are Corrupt | Sakshi
Sakshi News home page

వసూళ్ల రాజాలు

Published Tue, May 21 2019 10:29 AM | Last Updated on Tue, May 21 2019 10:29 AM

Community Police Officer (CPO) Are Corrupt - Sakshi

సాక్షి, ఏలూరు టౌన్‌ : కమ్యూనిటీ పోలీస్‌ ఆఫీసర్‌ (సీపీఓ).. పోలీసు శాఖలో సిబ్బంది కొరత దృష్టిలో పెట్టుకుని పశ్చిమ పోలీసు అధికారులు ఈ సీపీఓ వ్యవస్థను తెరపైకి తెచ్చారు. సమాజంలో యువకుల సహాయ సహకారాలతో స్థానికంగా నేరాలను అదుపు చేసేందుకు జిల్లాలో సీపీఓలను నియమించారు. కానీ ఆది నుంచీ సీపీఓలపై పలు అభియోగాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఏలూరు నగరంలో ఒక సీపీఓ ఏకంగా పోలీసు అవతారం ఎత్తి వసూళ్ల రాజాగా మారిపోయాడు. షాపులు, పేకాట స్థావరాలు.. ఇలా ఎక్కడబడితే అక్కడ దందాలు చేస్తూ సొమ్ములు వసూళ్లు చేస్తున్నాడు. తీరా అతను పోలీస్‌ కాదని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో ఏలూరు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి, అతడిని విచారిస్తున్నారు..

ఏలూరు నగరంలోని తంగెళ్లమూడి ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్‌ ఇంటర్‌ వరకూ చదువుకున్నాడు. 2017లో జిల్లాలో ఏర్పాటు చేసిన సీపీఓ వ్యవస్థలోకి ఇతనూ చేరాడు. ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సీపీఓగా నియమించబడ్డాడు. అతను కొంతకాలం టూటౌన్‌ సీఐ డ్రైవర్‌ అందుబాటులో లేని సమయంలో రాజ్‌కుమార్‌ సీఐ డ్రైవర్‌గా పనిచేశాడు. అదేవిధంగా టూటౌన్‌ స్టేషన్‌లోని ఎస్సైలను అత్యవసరంగా బయటకు తీసుకువెళ్లేందుకు డ్రైవర్‌గా పనిచేశాడు. ఇక పోలీసు అధికారులతో కలిసి డ్రైవర్‌గా నగరంలో తిరుగుతూ ఉండడంతో మార్కెట్‌లో గుర్తింపు వచ్చింది. నగరంలో వ్యాపారులకు సైతం సుపరిచితుడుగా మారాడు. అయితే కొద్దిరోజుల క్రితం ఈ సీపీఓ వ్యవస్థను పోలీస్‌ శాఖ నిలిపివేసింది. 

ఈ క్రమంలో రాజ్‌కుమార్‌ తంగెళ్లమూడిలోని ఒక పెట్రోల్‌ బంకులో బాయ్‌గా పనిచేసుకుంటున్నాడు. కానీ రాజ్‌కుమార్‌ తనకున్న పరిచయాలను ఆసరాగా చేసుకుని వసూళ్ల పర్వానికి తెరతీశాడు. స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని ఒక హోల్‌సేల్‌ బేకరీ యజమాని అతని స్నేహితులు పుట్టినరోజు వేడుకలు చేనుకుంటోన్న సమయంలో అక్కడికి వెళ్లిన రాజ్‌కుమార్‌ సార్‌.. మిమ్మిల్ని రమ్మంటున్నారంటూ బెదిరించాడు. భయపడిన బేకరీ యజమాని సార్‌తో మాట్లాడాలని కోరాడు. ఇదే అదనుగా రాజ్‌కుమార్‌ రూ.22 వేల నగదును తీసుకున్నాడు.

కొద్దిరోజుల తరువాత అతను సీపీఓగా పనిచేయటంలేదని తెలుసుకున్న బేకరీ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. ఏలూరు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఒక్కరి వద్దనే డబ్బులు వసూలు చేశాడా.. లేక ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా అని విచారణ చేస్తున్నారు. 

సీపీఓలపై అభియోగాలెన్నో.. 
గతంలోనూ ఏలూరు నగరంతో పాటు, జిల్లా వ్యాప్తంగా సీపీఓలపై అనేక ఫిర్యాదులు, అభియోగాలు వచ్చాయి. ఆయా పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తూ పోలీసు అధికారులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వాటిని ఆసరాగా చేసుకుంటూ దందాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఏలూరు టూటౌన్‌ స్టేషన్‌లోనే ఒక సీపీఓ ఇష్టారాజ్యంగా పోలీసుల పేరుతో దందాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. త్రీటౌన్‌ స్టేషన్‌లోనూ సీపీఓలు గతంలో పోలీసు వాహనాలను సైతం వినియోగిస్తూ షాపుల వద్ద హడావుడి చేయటం, వసూళ్లు చేస్తున్నారనే అపవాదు ఉంది.

కొందరు పోలీసు అధికారులు సైతం తమకు అనుకూలంగా పనిచేసే సీపీఓలతో వసూళ్లు చేయించటం పరిపాటిగా మారింది. రాత్రి వేళల్లో సైతం పేకాట స్థావరాలు, ఇతర దుకాణాలు, వ్యాపారులపై బెదిరింపులకు దిగి డబ్బులు దండుకున్న సంఘటనలు ఉన్నాయి. రాజ్‌కుమార్‌ సైతం పోలీస్‌ అధికారులతో పేకాటస్థావరాలు, షాపులు, వ్యాపారులు వద్దకు వెళుతూ పరిచయాలు పెంచుకోవటంతో యధావిధిగా పోలీసుల పేరుతో దందాలు చేయటం అలవాటుగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement