వీరఘట్టం: రేషన్‌కార్డులే కాదు.. అంత్యోదయ కార్డులు కూడా అనర్హుల చేతుల్లో పడి దుర్వినియోగమవుతున్నాయి. ఒక్కో కార్డు మీద నెలనెలా రూపాయికే కిలో రేటుకు 35 కిలోల బియ్యం పొం దుతున్నారు. వీటిని ఎక్కువ ధరలకు అమ్ముకొని లబ్ధి పొందుతున్నారు. మరోవైపు అర్హులైన పేదలు కార్డులు లేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. రికార్డుల ప్రకారం వీరఘట్టం మండలంలో 18 వేల కుటుంబాలు ఉండగా, అంతకంటే ఎక్కువగా 21371 కార్డులు చెలామణీలో ఉన్నాయి. వీటిలో అంత్యోదయ 1292, అన్నపూర్ణ 46,రచ్చబండ కూపన్లు 1271, తెల్లరేషన్ కార్డులు 18,762 ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం వీటిలో సగం వరకు బోగస్ కార్డులే ఉంటాయి.
అంత్యోదయ కార్డుల ద్వారా నెలకు 35 కిలోలు, తెల్ల కార్డుల్లో నమోదైన ఒక్కో సభ్యునికి నెలకు 5 కిలోల బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ విధం గా మండలంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నెలకు 30,050 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతున్నాయి. ఇందులో 50 శాతం మేర అర్హత లేని వారు బినామీ కార్డుదారులకే దక్కుతున్నాయి. ఈ బియ్యాన్ని బోగస్ కార్డుదారులు కిరాణా దుకాణాల్లో క్వింటాల్‌కు రూ. 1000 నుంచి రూ.1200 వరకు అమ్ముకుంటున్నారు. ఇదే బియ్యాన్ని ప్రభుత్వం రూ.2,346కు కొనుగోలు చేసి రూ.100కే పేదలకు అందజేస్తోంది. మిగిలిన రూ.2,240ను ప్రభుత్వం సబ్సిడీరూపంలో భరిస్తోంది.
ఉత్తుత్తి సర్వేలు
మండలంలో బోగస్ రేషన్‌కార్డులు ఉన్నట్టు రెం డేళ్ల క్రితం గుర్తించారు. అప్పట్లో రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు అధికారులు సర్వే చేసి 300 బోగస్ కార్డులను తొలగించారు. మొక్కుబడిగా జరిగిన ఈ సర్వే వల్ల పూర్తిస్థాయిలో బోగస్ కార్డులు బయటపడలేదు. క్షేత్ర స్థాయి సర్వేలు చేయకుండా వారం రోజుల పాటు అధికారులు, సిబ్బంది కార్యాలయాల్లో కూర్చొని ఏవో కొన్ని కార్డులను రద్దు చేశారు. కాగా ఇటీవల రెవెన్యూ అధికారులు అనర్హుల నుంచి తెల్లకార్డులను స్వాధీనం చేసుకుంటామని ప్రకటనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తెల్లరేషన్ కార్డులు తీసుకోకూడదని స్పష్టం చే శారు. అనర్హుల వద్ద తెల్లరేషన్‌కార్డులు ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అందువల్ల వాటిని తహశీల్దార్ కార్యాలయంలో అప్పగించాలని సూచిం చారు. అయినా ఇంతవరకు ఎవరూ ఏ ఒక్కరూ స్పం దించలేదు, బోగస్ కార్డులు కార్యాలయానికి చేరలేదు.
క్రిమినల్ కేసులు పెడతాం
అర్హత లేకుండా రేషన్‌కార్డులు, ఐఏవై కార్డులు కలిగి ఉన్నవారెవరినీ వదలమని తహశీల్దార్ ఎం.వి.రమణ అన్నారు. స్వచ్ఛందంగా రేషన్ కార్డులు అందజేస్తే వదిలేస్తామని, గడువు దాటిన తర్వాత కూడా బోగస్ రేషన్ కార్డులు ఉంచుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా పొందిన లబ్ధిని ఆర్‌ఆర్ యాక్ట్ ద్వారా వసూలు చేస్తామని స్పష్టం చేశారు.
బియ్యం బొక్కుతున్న ‘తెల్ల’దొరలు
Published Sun, Aug 17 2014 2:34 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM
Advertisement
Advertisement