రేషన్ కార్డుదారులందరికీ సంక్రాంతి కానుక
కర్నూలు(అగ్రికల్చర్): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రేషన్ కార్డుదారులందరికీ ఆరు రకాల సరుకుల గిఫ్ట్ ప్యాక్‌లను పకడ్బందీగా పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చంద్రన్న కానుకల పేరుతో గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీని ఆదివారం ఉదయం 8 గంటలకు జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయడం మొదలు పెట్టి సోమవారం సాయంత్రానికి పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 10.36 లక్షల కార్డుదారులకు వీటిని 2,411 చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నామని.. ఇందుకు అవసరమైన క్యారీ బ్యాగులు వచ్చాయన్నారు. కందిపప్పు 518 టన్నులు అవసరమని, శనివారం ఉదయం 10 గంటలకు 322 టన్నులు, పామోలిన్ ఆయిల్ 518 టన్నులకు గాను 224 టన్నులు, బెల్లం 518 టన్నులకు గాను 53 టన్నులు, వెయ్యి 103 టన్నులకు గాను 20 టన్నులు వచ్చిందన్నారు.
క్రమంగా జిల్లాకు అవసరమైన సరుకులు వస్తున్నాయని, వచ్చిన వాటిని వచ్చినట్లుగా స్టాక్‌పాయింట్లకు పంపుతున్నామన్నారు. శనగలు 1,036 టన్నులు అవసరమని, అయితే 150 టన్నులు మాత్రమే వచ్చిందని, మిగిలిన వాటిని నాపెడ్ ద్వారా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గోధుమ పిండి అవసరమైనంత ఉందన్నారు. చౌక దుకాణంలో కార్డుల సంఖ్య ఎక్కువగా ఉంటే అదనంగా ప్రత్యేక కౌంటర్ పెట్టి పంపిణీ చేస్తామన్నారు.
ఒక్కో కౌంటర్‌లో రోజుకు 250 నుంచి 300 గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ చేస్తామని, ఈ ప్రకారం సోమవారం సాయంత్రానికి పంపిణీ పూర్తి చేస్తామన్నారు. కర్నూలు పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఇబ్బందులు ఉంటే 08518-230727కు ఫోన్ చేయవచ్చన్నారు. 11, 12 తేదీల్లో తీసుకోలేని వారికి 13న అందజేస్తామన్నారు.
పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు
ఈనెల 13న గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు సంక్రాంతి సంబరాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 13న గ్రామాలను మామిడి తోరణాలు, అరటి పిలకలతో ప్రత్యేకంగా అలంకరిస్తామన్నారు. మహిళలకు ముగ్గులు, వంటలు, ఆటల పోటీలు నిర్వహిస్తామని, అన్ని సాంప్రదాయ కళలు ఉట్టిపడేలా సంబరాలు నిర్వహిస్తామన్నారు.
వ్యవసాయ వస్తువుల ప్రదర్శన, పాడి ఆవులు, ఒంగోలు గిత్తల ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. గ్రామస్థాయి పోటీల్లో గెలుపొందే వారికి సర్టిఫికెట్లు ఇస్తామని.. మండల, జిల్లాస్థాయిలో వరుసగా మూడు స్థానాల్లో గెలుపొందిన వారికి ప్రశంసాపత్రాలు, బహుమతులు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనే వారు 12వ తేదీ సాయంత్రంలోగా పేర్లు ఇవ్వాలన్నారు. జిల్లాలోని 898 గ్రామ పంచాయతీలను స్మార్ట్ విలేజీలుగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.
జేడీఏ ఠాగూర్‌నాయక్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ శాఖల్లో మంచి ఫలితాలు సాధించిన వారికి సంక్రాంతి పురస్కారాలను అందజేస్తామన్నారు. సమావేశంలో సీపీఓ ఆనంద్‌నాయక్, ఇన్‌చార్జి డీఎస్‌ఓ వెంకటరావు, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.