ఇంతకీ ఆత్మహత్యా... హత్యా?
భివండీ, న్యూస్‌లైన్ : నిలిపిఉంచిన ఓ టెంపోలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా అతని తల్లి మాత్రం హత్యకు గురయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిం ది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని అంజూర్‌ఫాటాపరిధిలో గల వినోభా భావేనగర్ ప్రాంతానికి చెందిన విశాల్ సోనావునే (22) అనే యువకుడు ఉద్యోగం లభించకపోవడంతో సుమారు రెండు సంవత్సరాలు గా ఖాళీగానే ఉంటున్నాడు.
రేషన్ కార్డు లను తయారు చేయిస్తానంటూ కొందరి వద్ద డబ్బులు తీసుకున్నాడు. అయితే సంబంధిత అధికారులు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో తమకు డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ స్థానికులు అతనిని ఒత్తిడికి గురిచేశారు. ఈ విషయమై స్థానికులకు, విశాల్‌కు మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు అతనిని కొట్టారు.
ఈ ఘటన అనంతరం విశాల్.. చాలీస్‌గావ్‌లోని బంధువుల ఇంట్లో కొద్దిరోజులు ఉండిపోయాడు. ఈ నెల 22వ తేదీన తిరిగి పట్టణానికి వచ్చాడు. నేరుగా ఇంటికి వెళ్లకుండా అంజూర్‌ఫాటా ప్రాంతంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న టెంపోలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం టెంపో యజమాని స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాడు. నార్‌పోళి పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం కేసు నమోదు చేశారు. అయితే ఇది ఆత్మహత్య కాదని, ఎవరో తన కుమారుడిని హత్య చేశారంటూ మృతుడి తల్లి భారతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.