మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఓ వ్యక్తి మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సి)లో ఫిర్యాదు చేశారు.
సాక్షి, హైదరాబాద్: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఓ వ్యక్తి మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సి)లో ఫిర్యాదు చేశారు. శుభ్రంగా ఉండరు.. చదువు రాదు.. ఎన్ని వసతులు కల్పించినా దళితులు మారరంటూ వారిపై ఇటీవల వైఎస్సార్‌జిల్లా జమ్మలమడుగులో మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దళితులను కించపరిచిన ఆయనపై రాజ్యాంగపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మేడ కృష్ణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై హెచ్‌ఆర్సీ స్పందించి అక్టోబర్ 31వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కడప ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.