
వంటగ్యాస్‌కు తిప్పలు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఐదు రోజుల కిందట రీఫిల్లింగ్ సిలిండర్ కోసం ఆన్‌లైన్ ద్వారా బుక్ చేశా. ఇప్పుడు ఆ బుకింగ్ రద్దు అయినట్లు నా సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఎందుకు క్యాన్సిల్ అయ్యింది?’’ అంటూ విజయనగర్ కాలనీకి చెందిన రంగారెడ్డి మాసబ్‌ట్యాంక్‌లోని జి.ఎన్.ఎస్.గ్యాస్ ఏజెన్సీ డీలరును శనివారం నిలదీశారు. ‘‘మీ పొరపాటు ఏమీ లేదు. సాంకేతిక లోపంవల్లే బుకింగ్ క్యాన్సిల్ అయింది. తిరిగి బుక్ చేసుకోండి...’’ అని ఆ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు సమాధానమిచ్చారు.
‘‘నేను చేసిన బుకింగ్ కూడా క్యాన్సిల్ అయినట్లు మెసేజ్ వచ్చింది. డీలర్‌ను అడిగితే మళ్లీ బుక్ చేసుకోమంటున్నారు. ఇప్పటికే రెండు గ్యాస్ సిలిండర్లు ఖాళీ అయ్యాయి. వంట ఎలా చేసుకోవాలో అర్థం కావడంలేదు...’’ అని కాస్ట్‌లీ హిల్స్‌కు చెందిన హిమబిందు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా వీరిద్దరే కాదు రాష్ట్ర రాజధానిలో చాలామంది గ్యాస్ వినియోగదారులకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. బుక్ చేసి పక్షం రోజులైనా వంటగ్యాస్ అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఆన్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసినా కారణం లేకుండానే ఈ బుకింగ్స్ రద్దవుతున్నాయి. రీఫిల్లింగ్ సిలిండర్ కోసం చేసుకున్న బుకింగ్ రద్దు అయిందంటూ కొందరు వినియోగదారుల సెల్‌ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు వస్తున్నాయి. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక విచారించేందుకు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే ఎందుకు అలా జరుగుతోందో తమకూ తెలియదని, మళ్లీ బుక్ చేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీల డీలర్లు సమాధానమిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ అందించేందుకు బాయ్ వెళ్లినప్పుడు వినియోగదారుని ఇంటికి తాళం వేసి ఉంటేనే బుకింగ్ రద్దవుతుందని కొందరు డీలర్లు చెబుతున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ తమ ఇళ్లకు పంపకుండానే బుకింగ్‌లు రద్దు చేసినట్లు మెసేజ్‌లు వస్తున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘ఇండేన్’లోనే సమస్య...
ఇండేన్ కంపెనీకి చెందిన డీలర్లకు గ్యాస్ సరఫరాలో సమస్య ఉంది. దీంతో వినియోగదారులు బుక్ చేసి పక్షం రోజులైనా వారికి గ్యాస్ సిలిండర్ అందడంలేదు. దీనిపై వినియోగదారులు ప్రశ్నిస్తుండటంతో తాము సమాధానం చెప్పుకోలేకపోతున్నామని ఇండేన్‌కు చెందిన ఒక డీలరు చెప్పారు. ‘‘బుక్ చేసి వారాలు గడుస్తున్నా గ్యాస్ సరఫరా చేయకపోతే వినియోగదారులకు నిజంగా ఇబ్బందే. దీంతో వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మూడు రోజులుగా సిలిండర్ల లోడ్ రాలేదు. మా పరిస్థితి ఏమీ చెప్పలేని విధంగా ఉంది’’ అని అన్నారు.
బుకింగ్ క్యాన్సిల్ కాకూడదు...
గ్యాస్ బుకింగ్‌లు క్యాన్సిల్ అవుతుండటంపై చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శ్రీకుమార్‌ను ‘సాక్షి’ టెలిఫోన్‌లో సంప్రదించగా.... అలా కారణం లేకుండా బుకింగ్స్ క్యాన్సిల్ అవ్వడానికి ఆస్కారం లేదని చెప్పారు. ‘‘ఎవరికైనా ఇలా అకారణంగా బుకింగ్ క్యాన్సిల్ అయితే మాకు సమాచారం ఇస్తే విచారించి అందుకు కారణం తెలియజేస్తాం. ఏదైనా లోపం లేనిదే ఇలా బుకింగ్ రద్దు కావడానికి అవకాశం లేదు’’ అని ఆయన వివరించారు.