చిన్నమండెం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య అటకెక్కింది. దీంతో పాఠశాలల్లోని కంప్యూటర్లు మూలనపడ్డాయి. 2008వ సంవత్సరంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల సక్సెస్ పాఠశాలను ఎంపిక చేసి ప్రభుత్వ ఉన్నతపాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం వ్యయాన్ని భరిస్తూ వచ్చాయి. విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించే బాధ్యతను ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించింది.
అందులో భాగంగా జిల్లాలో ‘ఎవరన్’ ఎడ్యుకేషన్ అనే సంస్థకు ఐదేళ్ల కాంట్రాక్టు అప్పగించారు. వీరి కాంట్రాక్టు 2013 డిసెంబర్‌లో ముగియడంతో వారు నియమించిన సిబ్బందిని తొలగించి, కంప్యూటర్ విద్యకు ఫుల్‌స్టాప్ పెట్టారు. అప్పటినుంచి జిల్లాలోని 220 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ఆగిపోయింది. కంప్యూటర్లు మూలన పడ్డాయి. దాదాపు 440 మంది కంప్యూటర్ ఉపాధ్యాయులు నిరుద్యోగులయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కంప్యూటర్లు ప్రధానోపాధ్యాయుల ఆధీనంలో ఉన్నాయి.
పట్టించుకోని ప్రభుత్వం
పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడమే తమ లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆగిపోయిన కంప్యూటర్ విద్య గురించి పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నామని చెబుతున్న మాటలకు ఆచరణకు ఏమాత్రం పొంతన లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్లను వినియోగించి అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు బోధిస్తే ఆ ఉపాధ్యాయుడికి వేతనంలో రూ.500 అదనంగా ఇవ్వాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ ప్రతిపాదననుఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
పర్యవేక్షణాధికారుల నిర్లక్ష్యం
పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించడంలో పర్యవేక్షణాధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఆది నుంచి కూడా సాంకేతిక విద్యను అందించడంలో వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెబుతున్నారు. పిల్లలు కంప్యూటర్ విద్య నేర్చుకుంటారని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన తల్లిదండ్రులు ప్రస్తుతం తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
కంప్యూటర్ టీచర్లను నియమించాలి:
గత సంవత్సరం కంప్యూటర్ టీచర్లను తొలగించారు. అప్పటి నుంచి కంప్యూటర్ క్లాస్‌లు ఎవ్వరూ చెప్పడం లేదు. 6,7తరగతుల్లో కంప్యూటర్ తరగతులు బాగా చెప్పేవారు. ఇప్పుడు టీచర్లను తొలగించడంతో ఇబ్బంది పడుతున్నాం.
డి.రమాదేవి, 8వ తరగతి,
టి.చాకిబండ ఉన్నత పాఠశాల
కంప్యూటర్ విద్యకోసమే ప్రభుత్వ
పాఠశాలలో చేరాను:
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ విద్య బాగా నేర్పుతున్నారని తెలుసుకుని మా తల్లిదండ్రులు ఈ పాఠశాలలో చే ర్పించారు. గత తరగతుల్లో కంప్యూటర్ విద్య నేర్చుకున్నాము, పదో తరగతికి వచ్చే సరికి కంప్యూటర్ ఉపాధ్యాయులను తొలగించారు.
హనుమంతురెడ్డి, 10వ తరగతి
కంప్యూటర్ విద్య తప్పనిసరి
సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్యార్థులందరికీ కంప్యూటర్ విద్య తప్పనిసరి. ప్రభుత్వం కనీస వేతనమైనా ఇచ్చి కంప్యూటర్ ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. ప్రత్యేకంగా కంప్యూటర్ ఉపాధ్యాయులు లేక ప్రభుత్వం ఇచ్చిన కంప్యూటర్లు మూలనపడ్డాయి.
- లక్ష్మీరమణయ్య, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం, చాకిబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల
కంప్యూటర్ మిథ్య
Published Wed, Aug 6 2014 2:20 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement