అటకెక్కిన కంప్యూటర్ విద్య!
• ఐసీటీ ప్రాజెక్టు కింద ఇచ్చిన కంప్యూటర్లు మాయం
• పాఠశాలల్లో చోరీ
• ఎన్ని ఉన్నాయో లెక్క తెలియని విద్యాశాఖ
• చేతివాటం ప్రదర్శించిన ఇంటి దొంగలు
మారుతున్న కాలానుగుణంగా..సర్కారు పాఠశాలల్లో అమలుచేసిన కంప్యూటర్ విద్య అటకెక్కింది. ఐసీటీ(ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ప్రాజెక్టు కింద పలు పాఠశాలలకు ఇచ్చిన కంప్యూటర్లు మాయమయ్యాయి. కొందరు ‘ఇంటిదొంగలు’ చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం :
పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్య అటకెక్కింది. కోట్లు ఖర్చుచేసి ఏర్పాటు చేసన కంప్యూటర్ ల్యాబ్‌లు ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్నాయి. ప్రభుత్వం ఐసీటీ(ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ప్రాజెక్టు కింద కోట్లు వెచ్చించి కంప్యూటర్ పరికరాలు అన్ని హంగులతో ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. రోజులు గడిచిచాయి, కంప్యూటర్లు పాతబడ్డాయి. అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షించడం మరిచిపోయారు. దీంతో కంప్యూటర్ విద్య పూర్తిగా అటకెక్కింది. నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ విద్య పేద విద్యార్థులకు అనివార్యం అని తెలిసినా ప్రభుత్వం 2008, 2010లో రెండు విడతలుగా ఎంపిక చేసిన పాఠశాలకు 11కంప్యూటర్లతో పాటు రూ.50వేలు విలుచేసే జనరేటర్లు, కుర్చీలు, ఫ్యాన్‌లు ప్రభుత్వం పంపిణీ చేసింది.
ఇంత విలువైన పరికరాల మూలకుపడ్డాయి.. కొన్ని చోట్ల చోరీకి గురయ్యాయి. వీటిలో ఎన్ని పనిచేస్తున్నాయో.. చోరీకి గురయ్యాయో.. వినియోగంలో ఉన్నాయో అన్న విషయానికి విద్యాశాఖ అధికారుల వద్ద ఎటువంటి సమాచారం లేదంటే వాటి నిర్వహణపై ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందో అర్థమవుతోంది. ప్రాజెక్టు నడిచిన కొన్ని రోజుల మాత్రం నానా హంగామా చేసి రోజులు గడుస్తున్న కొద్ది వాటిని నిర్లక్ష్యం చేశారు. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయింది.
మూలకుచేరిన కంప్యూటర్లు
పాఠశాలల్లో కంప్యూటర్లతో పాటు మిగితా పరికరాలు మమ్మతులు చేయడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో చాలాచోట్ల పాఠశాలల్లో కంప్యూటర్లు మరమ్మతులు, జనరేటర్ల సర్వీస్‌లకు నోచుకోలేదు. వాటిని వినియోగించడం మానేశారు. చాలాచోట్ల కంప్యూటర్లు మాయమయ్యాయి. జనరేటర్లు కూడా ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితిలో అధికార యంత్రాంగం ఉంది.
నిధుల కొరత
ప్రభుత్వం కంప్యూటర్ విద్య అందించేందుకు ఐసీటీ ప్రాజెక్టులో భాగంగా కంప్యూటర్లను ఉమ్మడి పాలమూరు జిల్లాలో సరఫరా చేశారు. కాని వాటి నిర్వహణ నిమిత్తం నిధులు ఇవ్వాలని ఎటువంటి నిబంధనలు లేవు. దీంతో వాటికి మైనర్ రీపేర్లు చేయించేందుకు, సర్వీసింగ్‌లు చేయించేందుకు నిధుల కొరత ఏర్పడింది. ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకొని పాఠశాలకు విడుదల చేసిన నిధుల నుంచి వాటి వినియోగానికి వాడుకోవాల్సి వస్తుంది. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, వారిని ప్రారంభంలో ఐదేళ్ల కాలపరిమితితో నియమించారు. కాలం ముగియడంతో వారిని తొలగించారు. సిబ్బంది, నిధుల కొరతతో కోట్ల విలువ చేసే కంప్యూటర్లు నిరుపయోగంగా ఉన్నాయి.
సమాచారం తెలియని విద్యాశాఖ
పాఠశాలల్లో కంప్యూటర్లకు ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ఉన్న కంప్యూటర్లు చాలావరకు మాయమయ్యాయి. అయితే ఎన్ని ఉన్నాయో, ఎన్ని లేవో సమాచారం తెలియని పరిస్థితిలో విద్యాశాఖ ఉంది. కంప్యూటర్లు చోరీకి గురయ్యాయా.. ఇంటి దొంగల చేతివాటం ప్రదర్శించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పాఠశాలకు రక్షణ లేనందున కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి అనుకున్న దానికి సమాచారం విద్యాశాఖ వారికి అందజేయాల్సి ఉంది.
లోపించిన పర్యవేక్షణ
ల్యాబ్‌ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి కాని ఇ టు అధికారుల నుంచి కాని పాఠశాలలకు నిబంధనలు, ని యమావళి అందలేదు. దీంతో ప్రాజెక్టు ఐసీటీ పూర్తికాగానే వాటిని గాలికి వదిలేశారు. అ«ధికారులు కూడా వాటిని ప ట్టించుకోవడం మానేయడంతో పాఠశాలల్లో ఉండాల్సిన కం ప్యూటర్లు పలువురు ఉపాధ్యాయులు ఇళ్లలో ఉంటున్నాయి.
ల్యాబ్‌లు పనిచేయడం లేదు
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు పం పిణీ చేసిన కంప్యూటర్లు ప్రస్తుతం ఎక్కడా పనిచేయడం లేదు. పనిచేసినా అవి ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకొని నడిపిస్తున్నారు. ల్యాబ్‌ల నిర్వహణకు సంబంధించి ఎటువంటి నిధులు, నిబంధనలు ప్రభుత్వం నుంచి రావడం లేదు. కంప్యూటర్ల పూర్తి వివరాలను సేకరించి వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటాం.
– సోమిరెడ్డి, డీఈఓ