సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు జడివానలోనూ ఆగలేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా 16వ రోజు ఉద్యోగ సంఘాలు, వ్యాపార వర్గాల ఆందోళనలు మహోద్యమంగా సాగాయి. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో మహిళలు ఎక్కడికక్కడ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేస్తూ నిరసన తెలిపారు. పెనుగంచిప్రోలు పాత సినిమా హాల్ సెంటర్‌లో డ్వాక్రా మహిళలు లక్ష్మీదేవి చిత్రపటాన్ని, కలశాన్ని అందంగా అలంకరించి, పసుపు, కుంకుమలతో శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయ వేద పండితులు చిట్టి చంద్రశేఖర శర్మచే శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. రాష్ట్ర విభజన జరగకుండా, అందరూ సమైక్యంగా ఉండాలని మహిళలు లక్ష్మీదేవిని ప్రార్థించారు. జగ్గయ్యపేటలో ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కూడలి వ ద్ద రోడ్డుపై మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్టీటీపీఎస్‌లోని మహిళా ఉద్యోగులు థర్మల్ గేట్ బయట రోడ్డుపైనే జోరువానలోనూ వరలక్ష్మీ వ్రతం పూజాదికాలు నిర్వహించారు.
జాగో నాయకా!
విజయవాడలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో కుక్క మెడలో, జాగో నాయకా జాగో బోర్డు కట్టి నిరసన తెలిపారు. పశుసంవర్ధక శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ విజయవాడలో సమావేశమై ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. మరుపిళ్ల చిట్టి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. చెన్నుపాటి పెట్రోల్ బంకు వద్ద నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు జరిగిన విద్యార్థుల జేఏసీ ర్యాలీలో మాజీ మంత్రులు మండలి బుద్ధప్రసాద్, దేవినేని నెహ్రూ పాల్గొన్నారు.
వినూత్న నిరసనలు..
జిల్లాలో శుక్రవారం నిరసనలు వినూత్నంగా సాగాయి. కలిదిండిలో ఎన్‌జీవోలు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలి వద్ద రాష్ట్ర విభజనకు నిరసనగా ఆందోళనలు నిర్వహించి దిష్టిబొమ్మలు దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల వ్యాపారులు నిరసన తెలిపారు. జగ్గయ్యపేటలో రైతుబజార్ బంద్ పాటించారు. హిజ్రాలు కూడా నిరసన ప్రదర్శన చేశారు. గుడివాడలో కేసీఆర్, సోనియా మాస్క్‌లతో గొర్రెలను ఊరేగిస్తూ మాంసం వర్తకులు వినూత్న నిరసన తెలిపారు. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, కార్మికులు బస్సులతో ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్ యజమానులు ఖాళీ ట్రాక్టర్లతో ర్యాలీ చేయగా, రైతుబజారులో వంటావార్పు నిర్వహించారు. మచిలీపట్నంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు, సిబ్బంది శుక్రవారం స్థానిక కోనేరుసెంటర్‌లో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మూడో రోజు రిలేదీక్షలను పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ తాతినేని పద్మావతి ప్రారంభించారు.
తిరువూరులో ఆర్టీసీ కార్మికులు, పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు, ఎన్జీవో జేఏసీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ పశువుల్ని ఊరేగించారు. కుక్కకు, ఎద్దుకు మెడలో దండలు వేసి పట్టణంలో ఊరేగించి సమైక్యాంధ్రను విడదీయవద్దంటూ వినతిపత్రాలు సమర్పించారు. పెడనలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులు జరిపిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాం ప్రసాదు మద్దతు పలికారు. బంటుమిల్లి చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో వంటలు చేయటం, ఇడ్లీ పిండి కడగటం, దోసెలు, గారెలు, మినప అట్లు, పెసర అట్లు వేయటం, చపాతీలు తయారు చేయటం లాంటి పనులు చేస్తూ తమ నిసరన తెలిపారు. హిజ్రాలు బంటుమిల్లి రోడ్డులో నాట్యాలు చేస్తూ నిరసనను తెలిపారు.
చాట్రాయి మండలం చనుబండలో రోడ్డుపై క్షవరం చే సి జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. నూజివీడులో ఎల్‌ఐసీ ఏజంట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బైక్ మెకానిక్‌ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నగాంధీబొమ్మ సెంటరులో ద్విచక్ర వాహనాలకు ఉచిత సర్వీసింగ్ నిర్వహించారు. నందిగామ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి రాస్తారోకో చేశారు. మైలవరంలోని తెలుగు తల్లి సెంటర్‌లో జాతీయ రహదారిపై శుక్రవారం ఆటల పోటీలు నిర్వహించారు.
ఉయ్యూరులో భారీ ప్రదర్శన
జోరువానలోనూ ఉయ్యూరులో శ్రీవిశ్వశాంతి పాఠశాల విద్యార్థులు పాఠశాల నుంచి సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి ప్రధాన సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఉయ్యూరు సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలేదీక్షల్లో మండల పాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తలు తాతినేని పద్మావతి, పడమట సురేష్‌బాబులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. తోట్లవల్లూరు మండలంలోని వల్లూరుపాలెంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయనీయకుండా, పోలీసులు తీసుకెళ్లిపోవటం ఉద్రిక్తతకు దారితీసింది. పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో పామర్రు ఫొటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల వెంట ప్రదర్శనలు చేశారు.
సమైక్యాంధ్ర....మహోద్యమం
Published Sat, Aug 17 2013 12:41 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement
Advertisement