
తేల్చని అఖిలపక్షం
రాజధాని ప్రతిపాదిత గ్రామ రైతులను మభ్యపెట్టేందుకు అఖిలపక్షం పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో ఏమీ తేల్చకుండానే మమ అనిపించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదని రైతులు తొలి నుంచి చెబుతున్న విషయాన్నే ఇక్కడా మరో సారి ఉద్ఘాటించడం విశేషం. త్వరలో ల్యాండ్ పూలింగ్ కేబినెట్ సబ్‌కమిటీ పర్యటనకు రానున్న నేపథ్యంలో శుక్రవారం తుళ్లూరులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
పేరుకు అఖిలపక్షం అని పిలిచినా అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించకపోవడంతో కేవలం సబ్‌కమిటీలో ప్రత్యేక ఆహ్వానితునిగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఒక్కరే వేదికపై కనిపించారు. మిగిలిన పార్టీ నేతలు లేకుండానే అఖిలపక్ష సమావేశాన్ని ముగించారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రతిపాదిత గ్రామం తుళ్లూరులో శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రైతులు ఎవరి వాదనలు వారు వినిపించారే తప్ప ఎలాంటి స్పష్టత రాలేదు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రైతులు రెండు వర్గాలుగా విడిపోయి వేర్వేరు వాదనలు వినిపించారు.
తుళ్లూరులో రాజధాని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రోజు నుంచి ఆ మండల రైతు కుటుంబాల్లో అలజడి ప్రారంభమైంది. తరతరాలుగా వ్యవసాయమే వృత్తిగా జీవిస్తున్న రైతులు ప్రభుత్వ నిర్ణయంపై కలత చెందారు.
ఉన్న భూమి ప్రభుత్వానికి ఇచ్చి తాము రాజధాని నిర్మాణ పనుల్లో కార్మికుల్లా పనిచేయాలా అని ప్రశ్నించారు. ఓ దశలో రెండు వర్గాల రైతుల మధ్య తీవ్రస్థాయిలో వాదనలు చోటుచేసుకున్నాయి. ఈ సమావేశం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా రైతుల మధ్య మరింత అగాధాన్ని పెంచిందని పలువురు వ్యాఖ్యానించారు.
భూములు లేని వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలపై సమావేశంలో ప్రస్తావనకే రాలేదు. రోజుకు సగటున రూ.300 కూలి పొందుతున్న వ్యవసాయ కార్మికులు ఈ రంగం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడనుందని భయాందోళన వ్యక్తమైంది.
ప్రభుత్వ నిర్ణయంతో వ్యవసాయ భూములు ఉండే అవకాశం లేదని ఇక తామంతా రాజధాని నిర్మాణ పనుల్లో రోజువారీ కార్మికులుగా మారే ప్రమాదం ఉందని, ఆ పనుల్లో నైపుణ్యత లేకపోవడం వల్ల వేతనం తగ్గుతుందనే భయం వారిని వెన్నాడుతోంది.
ఈ భూములపై ఆధారపడిన అన్ని వర్గాల గురించి చర్చ జరగకుండానే సమావేశం ముగిసింది. ఎమ్మెల్యే కూడా రైతుల అభిప్రాయాలను కేబినెట్ కమిటీకి తెలియచేస్తానని మాత్రమే చెప్పారు తప్ప స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అన్ని వర్గాలు నిరుత్సాహంతో వెనుతిరిగారు.