బోనకల్, న్యూస్‌లైన్‌ః నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా మహిళలపై దురాగతాలకు తెరపడడం లేదు. ఖమ్మం-కృష్ణాజిల్లా సరిహద్దు ప్రాంతమైన బోనకల్ శివారులో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మంగళవారం వెలుగు చూసిన ఈ సంఘటన కలకలం రేపింది. నిందితులు మహిళపై లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు...
జిల్లా సరిహద్దులో పొలాలకు వెళ్లే డొంకరోడ్డులో మహిళ మృతదేహం పడి ఉండడం, చుట్టూ రక్తపు మడుగు ఉండడం కొందరు కూలీలు మంగళవారం ఉదయం గమనించారు. వారు వెంటనే కృష్ణాజిల్లా వత్సవాయి వీఆర్వో సురేష్‌కు తెలియజేశారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో నందిగామ డీఎస్పీ చిన్నహుస్సేన్.. ఇన్‌చార్జి సీఐ భాస్కరరావు, చిల్లకల్లు ఎస్సై అబ్దుల్ నబీతో వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మహిళ తల కుడివైపు క ణతపై బలంగా రాయితో మోదినట్లు గాయాలున్నాయని డీఎస్పీ తెలిపారు. కాగా, మృత దేహానికి దగ్గరలో మద్యం సీసాలు ఉండటాన్ని బట్టి ఆమైపై లైంగికదాడి జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గుర్తుతెలియని వ్యక్తులు మహిళను రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం వద్దకు తీసుకువచ్చి తమ వెంట తెచ్చుకున్న మద్యాన్ని సేవించి, ఆమెపై లైంగిక దాడిచేసి ఆ తరువాత హత్యచేసి వుంటారని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, మృతురాలు ఖమ్మం జిల్లా వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు. చింతకాని, మధిర మండలాలకు చెందిన మహిళ అయివుంటుందన్న కోణంలో దర్యాప్తుచేస్తున్నారు. రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో కృష్ణాజిల్లా వత్సవాయి, ఖమ్మం జిల్లా బోన కల్ మండల ఆటో డ్రైవర్లను విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి సంఘటన స్థలంలో ఆధారాలకోసం అన్వేషిస్తున్నారు. మృతురాలి ఫొటోను చిల్లకల్లు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, బోనకల్, మధిర,చింతకాని తదితర పోలీస్‌స్టేషన్‌లలో ఉంచారు. మృతదేహాన్ని పోస్టుమార ్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ హత్య సంఘటనతో రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలాన్ని పెనుగంచిప్రోలు ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు, బోనకల్ ఎస్ ఐ రామకృష్ణారావు పరిశీలించారు.
లైంగికదాడి జరిపి ఆపై అఘాయిత్యం?
Published Wed, Jan 22 2014 2:21 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM
Advertisement