
పులివర్తి నాని అనుచరుల హత్యాయత్నం వల్ల వినికిడిని కోల్పోయిన పుట్టా రవి (ఫైల్‌ఫోటో)
చిత్తూరు , తిరుపతి రూరల్: నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు పల్లెల్లో చిచ్చురేపుతున్నాయి. చట్టాలు కఠినంగా ఉన్నా అధికారానికి తొత్తులుగా మారిన అధికారుల నిర్లక్ష్యం వల్ల చట్టాలు సైతం అభాసుపాలౌతున్నాయి. చివరకు పల్లెల్లో ప్రశాంతత కరువౌతోంది. సోదరులుగా ఉన్న పల్లె వాసులు ఫ్లెక్సీల మహమ్మారి వల్ల స్టేషన్లు్ల, ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఎదురౌతోంది. ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు దళితుడైన పుట్టా రవిపై పులివర్తి నాని అనుచరులు హత్యాయత్నం చేయడంతో అతను వినికిడి శక్తిని కోల్పోయాడు. జిల్లావ్యాప్తంగా ఫ్లెక్సీలను నిషేధించాలనే కలెక్టర్ ఆశయానికి సైతం కింది స్థాయి అధికారులు గండికొడుతున్నారు.
వినికిడి కోల్పోయిన దళితుడు..
దీపావళి సందర్భంగా చంద్రగిరి మండలం మొరవపల్లిలో పార్టీలకు అతీతంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగానే హరిజనవాడకు చెందిన దళితుడు పుట్టా రవి సైతం దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కాలనీలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. తమను ఎదిరించి ఫ్లెక్సీలు కడతావా? అంటూ కులం పేరుతో పులివర్తి నాని అనుచరులు 15 రోజుల క్రితం రవిపై హత్యాయత్నం చేశారు. అతను వెళ్తున్న బైక్‌ను కారుతో ఢీకొట్టారు. కిందపడిపోగానే కర్రలతో దాడి చేశారు. దాడిలో రవి చెవిపై కర్రతో బలంగా కొట్టారు. చావు బతుకుల్లో ఉన్న అతనిని దారినపోయే ప్రయాణికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. గాయాలతో పాటు చెవికి బలంగా తగలడంతో కర్ణభేరి పగిలిపోయింది. రవి వినికిడి శక్తిని కోల్పోయాడు. తిరుపతిలో చికిత్స పొందుతున్న అతనికి రెండు రోజుల్లో అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు.
నిందితులపై చర్యలు ఏవీ?
రవిని కులం పేరుతో దూషించడమే కాకుండా దాడితో హత్యాయత్నానకి పాల్పడిన పులివర్తి నాని అనుచరులు కాశింపెంట్ల మాజీ సర్పంచ్ గాలి సతీష్‌నాయుడు, కొమ్మినేని గిరి, శివ, పట్టాభిలపై పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలున్నాయి. దాడి జరిగి 15 రోజులు అవుతున్నా ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ఒత్తిళ్ల వల్లే పోలీసులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. తన కుమారుడికి వినికిడి శక్తి పోవటానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రవి తల్లి రమక్క డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment