
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సోమిరెడ్డి
కడప రూరల్ : అధికార పార్టీలో తమ్ముళ్ల మధ్య ఉన్న అసంతృప్తి సెగలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఆ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుతిమెత్తగా వాడీవేడిగా సాగింది. ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన జమ్మలమడుగు నియోజకవర్గం కంబాలదిన్నెలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారు. ఇది పార్టీ అధిష్టానానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ కార్యక్రమాన్ని ఎలా జయప్రదం చేద్దామని అన్నారు. దీంతో జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గ నేతలు మినహా మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన ఇన్‌చార్జిలు మంత్రి సోమిరెడ్డి సూచనతో విభేదించారు. జమ్మలమడుగులో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నట్లు కుండబద్ధలు కొట్టారు. అంతేగాక పదవులు, సంక్షేమ పథకాలు, కాంట్రాక్టు పనులు తదితర నిధులన్నీ జమ్మలమడుగు నియోజకవర్గానికేనా? అని నిలదీశారు. పార్టీలో మేము ప్రతినిధులం కాదా? మా నియోజకవర్గాల్లో ఉండేది ప్రజలు కాదా? అని నిలదీశారు.
దీంతో సోమిరెడ్డి నిశ్చేష్టులయ్యారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కడప సమీపంలోని కొప్పర్తిలో స్థలం సిద్ధంగా ఉందన్నారు. అలాగే సమీపంలోనే రైల్వేస్టేషన్, విమానాశ్రయం ఉన్నాయన్నారు. నీటి సౌలభ్యం కూడా అందుబాటులో ఉందని వివరించారు. విశాఖలోని గాజువాకలో ఉక్కు కర్మాగారం నెలకొల్పడంతో విశాఖ ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందేనన్నారు. అదేవిధంగా కొప్పర్తిలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే కడప మహానగరంగా రూపొందుతుందన్నారు. కాదు కూడదని జమ్మలమడుగులో ఏర్పాటు చేయాలని చూస్తే అది ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి మాత్రమే దోహదపడుతుందన్నారు. ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో ఇప్పుడు మీరేచెప్పాలంటూ మంత్రి సోమిరెడ్డిని ఎదురు ప్రశ్నించారు. తామంతా కడప సమీపంలోనే ఏర్పాటు చేయాలని తీర్మానించుకున్నామని తెలిపారు. దీనికి స్పందించిన సోమిరెడ్డి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని వివరించారు. అంతేగాక ఈనెల 7న పార్టీ అధినేత చంద్రబాబును కలిసి విషయం వివరించాలని నాయకులు నిర్ణయించారు. జమ్మలమడుగు మినహా మిగతా తొమ్మిది నియోజకవర్గాల పార్టీ నేతలు జమ్మలమడుగులో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో 27న ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరుగుతుందా? లేదా? అనేది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మినహా మిగతా నియోజకవర్గ ఇన్‌చార్జిలు, నాయకులు పాల్గొన్నారు.