పంటల సాగుపై అయోమయం
ఐఏబీ సమావేశం ఎప్పుడో?
మచిలీపట్నం : ఖరీఫ్ సీజన్ ముగుస్తోంది. మరో వారం, పది రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయి. ఈ తరుణంలో రబీ సీజన్‌కు సాగునీరు ఇస్తారా, లేదా అనే అంశంపై రైతుల్లో అయోమయం నెలకొంది. సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ నెలలోనే ఐఏబీ సమావేశం నిర్వహిస్తామని ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. ఏ తేదీన నిర్వహిస్తారో తెలియాల్సి ఉందని నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. ఐఏబీ సమావేశం నిర్వహించి ఎగువ ప్రాజెక్టుల్లో ఉన్న నీటి లభ్యత, జిల్లాలోని వివిధ పంటల సాగు తదితర అంశాలను బేరీజు వేసుకుని సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాగుతో పాటు తాగునీటి అవసరాల కోసం ఎంత నీరు విడుదల చేయాలనే అంశంపైనా ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
రైతుల్లో అయోమయం
ఈ ఏడాది ఖరీఫ్ ఆలస్యమైన నేపథ్యంలో ఈ నెల 15, 20 తేదీల మధ్యలో జిల్లాలో వరికోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముందస్తుగా బోరునీటి ద్వారా వరినాట్లు పూర్తిచేసిన కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు తదితర మండలాల్లో వరిచేలు కోతకు సిద్ధమయ్యాయి. కాలువ శివారు ప్రాంతంలో వరినాట్లు ఆలస్యం కావడంతో డిసెంబరులోనూ కోతలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వరికోత కోసే వారం రోజుల్లోపు పొలంలో మినుములు చల్లుతారు. వరికోతలు దగ్గర పడుతున్నప్పటికీ సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో రబీలో వరిసాగు చేయాలా లేక అపరాలు లేదా మొక్కజొన్న, కూరగాయలు సాగు చేయాలా అనే అంశంపై రైతుల్లో అయోమయం నెలకొంది. రబీ సీజన్‌లో సముద్రతీరంలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, కైకలూరు, కలిదిండి తదితర మండలాల్లో మూడు లక్షల ఎకరాల్లో అపరాల పంట సాగయ్యే అవకాశం లేదు. ఈ మండలాలకైనా సాగునీటి విడుదల చేస్తారా, లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
ఆధునికీకరణ పనులు జరిగేనా?
ఈ ఏడాది రబీలో సాగునీటిని విడుదల చేయకుంటే డెల్టా ఆధునికీకరణ పనులపై అధికారులు, పాలకులు దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు. గతంలో రూపొందించిన డెల్టా ఆధునికీకరణ పనులను పక్కనపెట్టిన ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించి, దాని సూచనల మేరకు పనులు చేస్తామని ప్రకటించింది. గత నెల 19న ఈ కమిటీ సభ్యులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పనులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శివారు ప్రాంతాలకు సాగునీటిని సకాలంలో అందించాలనే ఉద్దేశంతో 2008లో డెల్టా ఆధునికీకరణ పనులకు రూపకల్పన చేశారు. 2011, 2012 సంవత్సరాల్లో ఆధునికీకరణ పనులు చేసే నెపంతో రబీకి నీటి విడుదల నిలిపివేశారు. ఆ కాలంలో ఆధునికీకరణ పనులు కూడా మొక్కుబడిగానే జరిగాయి. 2011లో 13 శాతం, 2012లో ఎనిమిది శాతం పనులు మాత్రమే చేశారు. కాలువలను అభివృద్ధి చేయకుండా వంతెనల నిర్మాణం.. వాటికి అప్రోచ్‌లు, డ్రాప్‌ల నిర్మాణానికే ఈ పనులను పరిమితం చేశారు. 2014లో ఎన్నికలు ఉండటంతో రబీకి నీటిని విడుదల చేసి డెల్టా పనులను నిలిపివేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు.