సాహసోపేత జర్నలిజానికి నిదర్శనంగా నిలుస్తూ సాయుధ దుండగులు బైక్‌పై సంచరిస్తున్న ఫొటో ‘సాక్షి’ పత్రికలో ప్రచురితంకావడం పెద్ద సంచలనమైంది.
- దుండగులను కెమెరాలో బంధించిన విలేకరికి నజరానాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సాహసోపేత జర్నలిజానికి నిదర్శనంగా నిలుస్తూ సాయుధ దుండగులు బైక్‌పై సంచరిస్తున్న ఫొటో ‘సాక్షి’ పత్రికలో ప్రచురితంకావడం పెద్ద సంచలనమైంది. ఆదివారం ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు, మెట్రో నగరాలు, ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఫొటోపైనే చర్చ జరిగింది. ఎంతో సాహసంతో ఆ ఫొటోను వెలుగులోకి తెచ్చిన అర్వపల్లి విలేకరి శ్రీరంగం వెంకన్నకు అభినందనలు వెల్లువెత్తాయి.
అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఆ ఫొటో హల్‌చల్ చేసింది. దాదాపు అన్ని న్యూస్ చానెళ్లూ దాన్ని ఉపయోగించుకున్నాయి. ఫేస్‌బుక్, వాట్సప్, వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ప్రాణాలకు తెగించి దుండగులను సజీవంగా ప్రజలకు చూపెట్టిన ‘సాక్షి’ అర్వపల్లి విలేకరి వెంకన్నకు రాష్ట్ర ప్రెస్ అకాడమీ నజరానా ప్రకటించింది.
రూ. 15 వేల పారితోషికం అందించనున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. మరోవైపు వెంకన్న సాహసాన్ని గుర్తించి అతనికి రూ. 10 వేల నజరానా ఇస్తున్నట్టు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ క్రాంతికిరణ్ ప్రకటించారు.