'అన్యాయం జరిగిందన్న భావన సీమాంధ్రల్లో ఉంది'
న్యూఢిల్లీ : సీమాంధ్రలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు మంగళవారం ఆర్థిక మంత్రి చిదంబరంతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు పళ్లంరాజు, పురందేశ్వరి, కిల్లి కృపారాణి పాల్గొన్నారు. సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలను చిదంబరం దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయాలని కోరినట్లు సమాచారం.
భేటీ అనంతరం కేంద్ర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల అన్యాయం జరిగిందన్న భావన సీమాంధ్ర ప్రజల్లో కనిపిస్తోందని అన్నారు. విభజన వల్ల విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతామనే భయం వారిలో ఉందని.... ఇదే విషయాన్ని చిదంబరం, షిండే దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని, ద్విసభ్య కమిటీ కాదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలం చెప్పారు. అన్ని ప్రాంతాల వారి ఆందోళనలు తెలుసుకునేంత వరకూ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆపివేయాలని కోరామన్నారు.