కర్నూలు, న్యూస్‌లైన్:
దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మిణుకుమిణుకుమంటోంది. ఓటమి భయంతో నాయకులు ఒక్కొక్కరుగా పక్కచూపులు చూస్తున్నారు. ఆ పార్టీ అధిష్టానం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం తమ రాజకీయ భవిష్యత్తుకు చరమగీతం పాడుతుందనే భయం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతలు ప్రత్యామ్నాయం దిశగా అడుగులేస్తున్నారు. ప్రజల నాడీ పసిగట్టి ఏ పార్టీలో చేరితే గట్టెక్కుతామో తెలుసుకునేందుకు సర్వేలపై ఆధారపడుతున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ప్రజాదరణ నేపథ్యంలో ఇప్పటికే పలువురు నాయకులు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడుస్తున్నారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తితో పార్టీ వీడేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర చిన్న తరహా నీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్, న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే మురళీకృష్ణ తదితరులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
బనగానపల్లె, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో పార్టీ కనీసం ఇన్‌చార్జీలను కూడా నియమించుకోలేని పరిస్థితి నెలకొంది. పార్టీ అనుబంధ సంఘాల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. కర్నూలులో ఓ నాయకుడు ఇటీవల రేషన్ షాపుల డీలర్లతో ప్రత్యేకంగా సమావేశమై పార్టీ మారనున్న తనకు ఇప్పటి మాదిరే సహకరించాలని కోరినట్లు సమాచారం. ఇకపోతే మహిళా విభాగానికి దాదాపు తొమ్మిది సంవత్సరాాలుగా నాయకత్వం కరువైంది. మహిళా కాంగ్రెస్‌లో పని చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ విభాగాల కమిటీలు రద్దయి ఐదు మాసాలు గడుస్తున్నా వాటి బాధ్యతలు చేపట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడం పార్టీ దుస్థితికి నిదర్శనం. యువతకు పెద్దపీట వేయాలని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలు జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదని యువజన కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పని చేసిన వారికి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన వారికే పదవులు కట్టబెడుతున్నారని విద్యార్థి, యువజన విభాగాల నాయకులు కొంతకాలంగా అలకబూనారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గంగాధర్‌రెడ్డికి ఏపీఐడీసీ చైర్మన్ పదవి కట్టబెట్టడం పట్ల పార్టీలో వివాదం నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేని వ్యక్తికి ఎలా పదవి కట్టబెడతారంటూ నాయకులు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్ సత్యం యాదవ్ సైతం కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీయేతరులకు పదవులు కట్టబెట్టడం పట్ల నిలదీయడంతో ఆయనపైనే దాడి జరగడం గమనార్హం. ఐఎన్‌టీయూసీ పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఐఎన్‌టీయూసీ బలోపేతానికి కృషి చేయాల్సిన నేతలు ప్రత్యేకంగా కార్మిక సంఘం ఏర్పాటు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఏఐసీసీ పరిశీలకుడు ప్రమోద్ మద్వరాజ్(కర్ణాటక రాష్ట్రం ఉడిపి ఎమ్మెల్యే) జిల్లా పర్యటనకు రానుండటం ప్రా ధాన్యతను సంతరించుకుంది. మధ్యాహ్నం ఆయన స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నాయకులు పార్టీ మారితే ప్రత్యామ్నాయం ఏమిటి.. ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం నెలకొంటుందనే విషయాలపై ఆయన చర్చించనున్నారు. ఈ నివేదికను రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలోని ఎన్నికల కసరత్తు బృందానికి అందజేస్తారని సమాచారం.