ఏం‘కర్మ’ వచ్చింది..!
మచిలీపట్నం టౌన్ : ‘ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి..’ అన్నట్టు ఉంది జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఘనమైన చరిత్ర గల ఆ పార్టీ జిల్లా కార్యాలయం నేడు అధ్వాన స్థితికి దిగజారింది. ఎందరో రాజకీయ ఉద్దండులతో వెలుగొందిన ఈ కార్యాలయం నేడు పెదకర్మలు నిర్వహించుకునే కేంద్రంగా మారింది. ఈ పరిస్థితిని చూసి కాంగ్రెస్ నాయకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత..
ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అప్పటి నుంచి నాయకులు ఎవరూ పెద్దగా డీసీసీ కార్యాలయమైన పట్టాభి భవనం వైపు వచ్చిన దాఖలాలు లేవు. పార్టీ కార్యక్రమాలు కూడా బాగా తగ్గిపోయాయి. దీంతో కార్యాలయ నిర్వహణను పర్యవేక్షించే స్థానిక నాయకులు పెదకర్మలు, పెళ్లిళ్లు, పేరంటాలకు అద్దెకు ఇస్తున్నారు. గతంలో పెళ్లిళ్లకు మాత్రమే ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చేవారు. ఇటీవల కర్మలకు కూడా అద్దెకు ఇస్తున్నారు. ఆదివారం ఓ మహిళ పెదకర్మ నిర్వహణకు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ కార్యాలయ నిర్వాహకులు ఏకపక్షంగా అద్దెకు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నాకు తెలియదు : నరహరిశెట్టి
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆదివారం పెదకర్మకు అద్దెకు ఇచ్చిన విషయం తనకు తెలియదని డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి చెప్పారు. తాను డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత పెళ్లిళ్లకు కూడా అద్దెకు ఇవ్వొద్దని చెప్పానని తెలిపారు. పెదకర్మకు అద్దెకు ఇచ్చిన సంఘటనపై వివరాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.