కుమ్మక్కు కుట్ర | Nexus conspiracy | Sakshi
Sakshi News home page

కుమ్మక్కు కుట్ర

Published Sat, Mar 29 2014 1:29 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కుమ్మక్కు కుట్ర - Sakshi

కుమ్మక్కు కుట్ర

  • విలువలకు తిలోదకాలు             
  •  టీడీపీ, కాంగ్రెస్ చెట్టపట్టాల్
  •  వైఎస్సార్‌సీపీ హవాను తట్టుకోలేకే..
  •  టీడీపీకి ఓటేయాలంటూ బాహాటంగా కాంగ్రెస్ నేతల ప్రచారం
  •  మచిలీపట్నం, న్యూస్‌లైన్ : మచిలీపట్నం మున్సిపాలిటీలో టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కు కుట్రకు తెరతీశాయి. పురపోరులో వైఎస్సార్‌సీపీ హవాను తట్టుకోవడం కష్టమని భావించిన కాంగ్రెస్, టీడీపీ నేతలు అడ్డగోలుగా అయినా వారి గెలుపును ఆపేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ఈ వ్యవహారం చూసిన ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
     
    మచిలీపట్నం పురపాలక సంఘంలో 42 వార్డులు ఉండగా 27 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన ఆ పార్టీ నాయకులు తాము నిలబెట్టిన అభ్యర్థులను బలి పశువులుగా మార్చి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని బహిరంగంగానే వీధుల వెంట తిరుగుతూ ప్రచారం చేయటం విస్మయానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న తమ పరిస్థితి ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తే మిన్నకుండిపోవటం కాంగ్రెస్ నాయకుల వంతవుతోంది.

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పురపాలక సంఘ ఎన్నికల్లో దెబ్బతీసేందుకు అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ నాయకులు విలువలను పక్కన పెట్టడం విమర్శలకు దారితీస్తోంది. పట్టణంలో లిక్కర్ వ్యాపారం చేసే ఓ నాయకుడు, బందరు పురపాలక సంఘంలో సీనియర్‌గా పేరొందిన మరో నాయకుడు కాంగ్రెస్ పార్టీ పరువును కాపాడేందుకు పురపాలక సంఘంలో 27 మంది అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తరువాత వారం రోజుల పాటు పార్టీ అభ్యర్థులతో విస్తృత ప్రచారం చేయించారు. క్రమంగా కాంగ్రెస్ అభ్యర్థులను పట్టించుకోవటం మానేశారు.

    పట్టణంలోని 26వ వార్డులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలుపును నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు, ఆయన కుమారుడు ఇంటింటికి తిరిగి టీడీపీ అభ్యర్థిని గెలిపించమని ప్రచారం చేస్తుండటంతో ఆ వార్డు ప్రజలు కంగుతింటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పక్కనపెట్టి టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని చెబుతుండటంతో ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
     
    18వ వార్డులోనూ...
     
    18వ వార్డు (గిలకలదిండి) లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బందరు పురపాలక సంఘంలో సీనియర్‌గా పేరొందిన ఓ కాంగ్రెస్ నాయకుడు వార్డులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలిస్తే తన పరువు పోతుందని భావించి కాంగ్రెస్ అభ్యర్థి గెలవకున్నా ఫర్లేదు.. టీడీపీ అభ్యర్థిని మాత్రం గెలిపించండంటూ బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. 20వ వార్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు టీడీపీ, వైఎస్సార్ సీపీ తరఫున ఇక్కడ పోటీలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిని ఓడించాలని, టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తుండటంతో ఓటర్లు అవాక్కవుతున్నారు.
     
    చైర్మన్ పదవి పేరుతో వసూళ్లా!
     
    పట్టణంలో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ నాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామన్న చందంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ తరఫునన పెద్ద పదవిలో ఉన్న ఓ నాయకుడి బంధువు పట్టణంలోని వ్యాపారుల వద్దకు వెళ్లి మీవాడినే పురపాలక సంఘ చైర్మన్‌గా చేస్తామంటూ ఒక సామాజికవర్గం ప్రముఖుల వద్ద చందాలు దండుకునే ప్రయత్నం చేశాడు. చైర్మన్ పదవిని ఆశిస్తున్న వ్యక్తిని సైతం రెండు కోట్ల రూపాయలు తేవాలని చెప్పినట్టు సమాచారం. ఆయన రూ.50 లక్షలు మాత్రమే ఇవ్వగలనని చెప్పినట్టు తెలిసింది.

    ఈ నేపథ్యంలో పట్టణంలో బలంగా ఉన్న మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చైర్మన్ పదవిలో కూర్చోబెడతామని ఈ నాయకులే చెబుతున్నారు. అంటే కోట్లు ఎవరిస్తే వారికి పదవి ఇస్తారా? అంటూ మిగిలిన సామాజికవర్గాల వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదంతా ఇలా వుంటే పురపాలక సంఘ ఎన్నికల్లో టీడీపీకి అసలు చైర్మన్‌గిరీకి అవసరమైన సీట్లొస్తాయా అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బందరు పురపాలక సంఘంలో ఈ రెండు పార్టీల నాయకులు తమ హవాను నిలువరించలేరని  వైఎస్సార్ సీపీ నాయకులు ఘంటాపథంగా చెబుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement