రాష్ట్ర విభజన అంశంతో ఇరు ప్రాంతాల్లో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరో కొత్త డ్రామాకు రూపకల్పన చేస్తోంది.
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన అంశంతో ఇరు ప్రాంతాల్లో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరో కొత్త డ్రామాకు రూపకల్పన చేస్తోంది. ఇరు ప్రాంత నేతలతో సయోధ్య పేరిట భేటీలు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. విభజన వ్యవహారాన్ని కాంగ్రెస్ సొంత వ్యవహారంగా మార్చిందన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో అదే పార్టీ ఇరు ప్రాంతాల మధ్య రాజేసిన ఉద్రిక్తతలను అస్త్రంగా మల్చుకొని ప్రయోజనం పొందాలన్న ఎత్తుగడల్లో వెళ్లే ఆలోచన చేస్తోంది. మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు, ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు శుక్రవారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో సమావేశమై ఈ అంశంపై ప్రాథమికంగా చర్చలు జరిపారు.
ఇతర పార్టీలు కలసి వచ్చినా రాకున్నా తమ పార్టీ వరకైనా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలందరూ ఒకే వేదికపైకి వచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించాలని వారు నిర్ణయించారు. ప్రజల మధ్య విద్వేషాలు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలోనైనా పార్టీ పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటే మంచిదని చర్చించారు. ‘రాష్ట్ర విభజనతో రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలి. ఎక్కడో ఒకచోట దీనికి చర్చలు ప్రారంభం కావాలి. ప్రక్రియ పూర్తికావాలంటే చర్చలు పెద్దల మధ్య సాగాలి’ అని ఏరాసు ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించారు.