సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు మరో ఎత్తు
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమం నుంచి ప్రజలు, ఉద్యోగులను పక్కదారి పట్టించేందుకే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. నవంబరు 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. అయితే, ఒకవైపు భారీ వర్షాలు, పంట నష్టం.. మరోవైపు రాష్ట్ర విభజన, సమైక్య ఉద్యమం.. వీటిని ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే రెండేళ్ల తరువాత ‘రచ్చబండ’ను తెరమీదకు తెచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
2011 నవంబరులో రెండో విడత రచ్చబండను నిర్వహించారు. అప్పుడు దాదాపు 50 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో రేషన్‌కార్డుల కోసం 19.60 లక్షలు, పెన్షన్ల కోసం 11.67 లక్షలు, గృహాల కోసం 20.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అధికారులు 13 లక్షలకు పైగా దరఖాస్తులను తిరస్కరించారు. అర్హులైన వారి జాబితాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. కాని రెండేళ్ల నుంచి అర్హులైన వారికి లబ్ది చేకూర్చడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దాంతో గత రెండేళ్లుగా దరఖాస్తులు ఇచ్చిన ప్రజలంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ఆ దరఖాస్తులను పరిష్కరించకుండా రెండేళ్లపాటు కాల యాపన చేసిన ప్రభుత్వ పెద్దలకు పేద ప్రజలపై హఠాత్తుగా ప్రేమ పుట్టుకు వచ్చిందన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న అధికార పార్టీ నాయకులు.. ఈ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని ముందుకు వెళ్లాలనుకుంటున్నారని పలువురు భావిస్తున్నారు.
పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలకు ముందు రచ్చబండ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే, అనుకోకుండా జూలై 30 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన, తదనంతరం సీమాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం రావడం తెలిసిందే. 13 జిల్లాల్లోని ఉద్యోగులంతా రెండునెలలకు పైగా నిరవధిక సమ్మె చేయడంతో పాలన స్తంభించిపోయింది. క్రమంగా ఒక్కో సంఘాన్ని సమ్మె నుంచి విరమించేలా ఒత్తిడి తీసుకుని వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చారు. ఇప్పుడా ఉద్యమాన్ని పూర్తిగా పక్కదారి పట్టించడానికి, రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందడానికి రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను ఏదో విధంగా తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో మూడో రచ్చబండ కార్యక్రమానికి తెరలేపారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఉపసంఘం భేటీ
రచ్చబండ నిర్వహణకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమైంది. వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షతన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, పార్ధసారథి, వట్టి వసంతకుమార్, డికె ఆరుణ తదితరులు కార్యక్రమాన్ని రూపొం దించారు. అనంతరం కన్నా లక్ష్మినారాయణ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వద్దకు వెళ్లి రచ్చబండ తేదీలను ఖరారు చేశారు. నవంబర్ ఆరు నుంచి 24వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయిం చినట్లు కన్నా లక్ష్మినారాయణ మీడియాకు తెలిపారు.
పక్కదారి పట్టించేందుకే రచ్చబండ
Published Fri, Oct 25 2013 3:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
Advertisement
Advertisement