సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కేడర్‌లో వ్యతిరేకత పెరిగింది. హైకమాండ్ పరిశీలకుడి ముందు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారి ప్రవర్తన, పనితీరుపై సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు ఆక్రోశం వెళ్లగక్కారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుపు ముళ్లబాటేనని కుండబద్దలు కొట్టారు. గెలుపు గుర్రాల ఆన్వేషణలో భాగంగా ఏఐసీసీ నియమించిన పరిశీలకుడు, మహారాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ ఎల్గుల్వర్ గురువారం డీసీసీ కార్యాలయంలో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ నేతలతో అభిప్రాయ సేకరణ జరిపారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఎల్‌బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ పరిస్థితి, సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ మేరకు ముందుగానే రూపొందించిన ఫార్మాట్‌లో అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా తీసుకున్నారు. ముందుగా మేడ్చల్ నియోజకవర్గ నాయకులతో విడివిడిగా మాట్లాడిన ప్రకాశ్.. స్థానిక ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి విజయావకాశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కేఎల్లార్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా శామీర్‌పేట మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే పార్టీకి భంగపాటు తప్పదని తేల్చిచెప్పారు. స్థానికేతరులకు గాకుండా... స్థానికులకే టికెట్ కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర తరహాలో ఇక్కడా స్థానిక, స్థానికేతర అంశం అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనుందని పేర్కొన్నారు. పార్టీని సమన్వయపరచడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారనే భావన పార్టీ శ్రేణుల్లో నెలకొందని, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఘట్‌కేసర్, శామీర్‌పేటకు చెందిన ముగ్గురు సీనియర్ నేతలు పరిశీలకుడి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. డీసీఎంఎస్ డెరైక్టర్ పెంటారెడ్డి సహా డీసీసీబీ కార్యదర్శులు దోసకాయల వెంకటేశ్, బాల్‌రాజ్, మాజీ సర్పంచ్ సింగం సత్తయ్య తదితరులు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కేఎల్లార్ రేసులో లేకపోతే స్థానిక నేతలు సింగిరెడ్డి నవీన్‌చందర్, ఉద్దెమర్రి నర్సింహారెడ్డి అభ్యర్థిత్వాలను పరిగణనలోకి తీసుకోవాలని పలువురు నేతలు అధిష్టానం దూతకు తెలియజేశారు. మరోవైపు మల్కాజ్‌గిరి ఎంపీ సర్వే సత్యనారాయణ వ్యవహారశైలిపై కూడా పలువురు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చినట్లు సమాచారం.
ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య నెలకొన్న వివాదాలతో పార్టీ నేతలు సతమతమవుతున్నారని, ఆయన అభ్యర్థిత్వాన్ని మారిస్తే తప్ప గెలుపు కష్టమని తేల్చిచెప్పారు. కాగా, ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్మోహన్‌గౌడ్ పరిశీలకుడి ముందు తమ అనుచరగణంతో బల ప్రదర్శనకు దిగారు. వేలాదిగా తరలివచ్చిన మద్దతుదారులను కట్టడి చేసేందుకు డీసీసీ అధ్యక్షుడు మల్లేశ్ స్వయంగా రంగంలోకి దిగాల్సివచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌కు టికెట్ కేటాయించవద్దని రామ్మోహన్ వర్గం పరిశీలకుడితో స్పష్టంచేసింది. ఎమ్మెల్యే టికెట్ తనకు.. సర్వేకే మళ్లీ ఎంపీ సీటును ఖరారు చేయాలని సూచించింది. కాగా, సుధీర్‌రెడ్డి వర్గీయులు మాత్రం సర్వే అభ్యర్థిత్వాన్ని అంగీకరించేదిలేదని, ఈ సీటును జయసుధ లేదా ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డికి ఇవ్వాలని కోరారు. ఇదిలావుండగా ఆశావహులు వ్యూహాత్మకంగా తమ అనుచరులతో ప్రత్యర్థులపై ఫిర్యాదుల పరంపరను కొనసాగించడం గమనార్హం.
12న నివేదిక సమర్పిస్తా: ప్రకాశ్
నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నా. 11వ తేదీవరకు మల్కాజిగిరి ఎంపీ సహా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలతో భేటీ అవుతా. వారందరి నుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి 12న అధిష్టానానికి నివేదిస్తా. పొత్తులు, పార్టీ విజయావకాశాలు, అభ్యర్థుల గుణగణాలు, ప్రత్యర్థుల బలాబలాలపై వివరాలు సేకరిస్తున్నా.
సిట్టింగ్‌లపై చిటపట!
Published Fri, Jan 10 2014 3:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement