kichannagari laxma reddy
-
దేవేందర్‌గౌడ్‌ను కలిసిన కేఎల్ఆర్
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు తూళ్ల దేవేందర్‌గౌడ్‌ను ఏఐసీసీ సభ్యుడు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) శుక్రవారం నగరంలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కేఎల్ఆర్, దేవేందర్‌గౌడ్‌లు అరగంటసేపు మేడ్చల్ తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది. తాను మేడ్చల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నానని, పొత్తులో భాగంగా టీడీపీ తనకు పూర్తిస్థాయిలో మద్దతివ్వాలని కేఎల్ఆర్ దేవేందర్‌గౌడ్‌ను కోరినట్లు తెలిసింది. కేఎల్ఆర్ దేవేందర్ గౌడ్‌ను కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే మేడ్చల్ స్థానాన్ని వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా మేడ్చల్ సీటు తమకే ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టే అవకాశముంది. మరోపక్క కాంగ్రెస్‌తో పొత్తు కోసం చర్చలు జరిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. -
సిట్టింగ్‌లపై చిటపట!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కేడర్‌లో వ్యతిరేకత పెరిగింది. హైకమాండ్ పరిశీలకుడి ముందు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారి ప్రవర్తన, పనితీరుపై సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు ఆక్రోశం వెళ్లగక్కారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుపు ముళ్లబాటేనని కుండబద్దలు కొట్టారు. గెలుపు గుర్రాల ఆన్వేషణలో భాగంగా ఏఐసీసీ నియమించిన పరిశీలకుడు, మహారాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ ఎల్గుల్వర్ గురువారం డీసీసీ కార్యాలయంలో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ నేతలతో అభిప్రాయ సేకరణ జరిపారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ పరిస్థితి, సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ముందుగానే రూపొందించిన ఫార్మాట్లో అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా తీసుకున్నారు. ముందుగా మేడ్చల్ నియోజకవర్గ నాయకులతో విడివిడిగా మాట్లాడిన ప్రకాశ్.. స్థానిక ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి విజయావకాశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కేఎల్లార్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా శామీర్‌పేట మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే పార్టీకి భంగపాటు తప్పదని తేల్చిచెప్పారు. స్థానికేతరులకు గాకుండా... స్థానికులకే టికెట్ కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర తరహాలో ఇక్కడా స్థానిక, స్థానికేతర అంశం అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనుందని పేర్కొన్నారు. పార్టీని సమన్వయపరచడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారనే భావన పార్టీ శ్రేణుల్లో నెలకొందని, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఘట్కేసర్, శామీర్‌పేటకు చెందిన ముగ్గురు సీనియర్ నేతలు పరిశీలకుడి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. డీసీఎంఎస్ డెరైక్టర్ పెంటారెడ్డి సహా డీసీసీబీ కార్యదర్శులు దోసకాయల వెంకటేశ్, బాల్‌రాజ్, మాజీ సర్పంచ్ సింగం సత్తయ్య తదితరులు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కేఎల్లార్ రేసులో లేకపోతే స్థానిక నేతలు సింగిరెడ్డి నవీన్చందర్, ఉద్దెమర్రి నర్సింహారెడ్డి అభ్యర్థిత్వాలను పరిగణనలోకి తీసుకోవాలని పలువురు నేతలు అధిష్టానం దూతకు తెలియజేశారు. మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ సర్వే సత్యనారాయణ వ్యవహారశైలిపై కూడా పలువురు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య నెలకొన్న వివాదాలతో పార్టీ నేతలు సతమతమవుతున్నారని, ఆయన అభ్యర్థిత్వాన్ని మారిస్తే తప్ప గెలుపు కష్టమని తేల్చిచెప్పారు. కాగా, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్మోహన్‌గౌడ్ పరిశీలకుడి ముందు తమ అనుచరగణంతో బల ప్రదర్శనకు దిగారు. వేలాదిగా తరలివచ్చిన మద్దతుదారులను కట్టడి చేసేందుకు డీసీసీ అధ్యక్షుడు మల్లేశ్ స్వయంగా రంగంలోకి దిగాల్సివచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌కు టికెట్ కేటాయించవద్దని రామ్మోహన్ వర్గం పరిశీలకుడితో స్పష్టంచేసింది. ఎమ్మెల్యే టికెట్ తనకు.. సర్వేకే మళ్లీ ఎంపీ సీటును ఖరారు చేయాలని సూచించింది. కాగా, సుధీర్‌రెడ్డి వర్గీయులు మాత్రం సర్వే అభ్యర్థిత్వాన్ని అంగీకరించేదిలేదని, ఈ సీటును జయసుధ లేదా ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డికి ఇవ్వాలని కోరారు. ఇదిలావుండగా ఆశావహులు వ్యూహాత్మకంగా తమ అనుచరులతో ప్రత్యర్థులపై ఫిర్యాదుల పరంపరను కొనసాగించడం గమనార్హం. 12న నివేదిక సమర్పిస్తా: ప్రకాశ్ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నా. 11వ తేదీవరకు మల్కాజిగిరి ఎంపీ సహా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలతో భేటీ అవుతా. వారందరి నుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి 12న అధిష్టానానికి నివేదిస్తా. పొత్తులు, పార్టీ విజయావకాశాలు, అభ్యర్థుల గుణగణాలు, ప్రత్యర్థుల బలాబలాలపై వివరాలు సేకరిస్తున్నా. -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీ లు షురూ
కీసర, న్యూస్‌లైన్: వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులతో కీసరలో సందడి నెలకొంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక సెరినీటి పాఠశాలలో శుక్రవారం 59వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. వీటిని మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఇక్కడి పోటీల్లో మంచి ప్రతిభ చూపి జాతీయ, అంతర్జాతీయస్థాయికి చేరుకోవాలన్నారు. ప్రతి క్రీడాకారుడు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రస్థాయి పోటీలు మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఖోఖో పోటీల్లో 23 జిల్లాల నుంచి బాలికలు, బాలుర విభాగంలో ఒక్కో జట్టు చొప్పున పాల్గొంటున్నాయన్నారు. మొత్తం 552 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటున్నారని, 130 మంది వ్యాయామఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులకు స్థానికంగా వసతి ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అంతకు ముందు క్రీడాకారులు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. కార్యక్రమంలో క్రీడా పోటీల రాష్ట్ర అబ్జర్వర్ విజయేందర్, శ్యాంసుందర్, టోర్నమెంట్ ఇన్చార్జి రమేష్‌రెడ్డి, తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎండీఓ నిరంజన్, ఎంఈఓ రాంప్రసాద్, స్థానిక సర్పంచ్ చినింగని గణేష్, ఉపసర్పంచ్ రాయిల శ్రావన్కుమార్గుప్తా, కీసరగుట్ట దేవస్థానం చైర్మన్ తటాకం నారాయణశర్మ, కాంగ్రెస్ నేతలు తటాకం వెంకటేష్, పన్నాల బుచ్చిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు జ్యోతి సురేష్, కుర్రి మానస, రాజమణి పాల్గొన్నారు. మొదటి రోజు విజేతలు ఖోఖో పోటీల్లో మొదటిరోజు విజేతలుగా నిలిచిన జట్ల వివరాలను పోటీల ఇన్చార్జి రమేష్‌రెడ్డి వెల్లడించారు. బాలికల విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టు మెదక్ జిల్లాపై, నల్గొండ జిల్లా జట్టు ఖమ్మంపై, మెదక్ జట్టు హైదరాబాద్ జిల్లా జట్టుపై, చిత్తూరు జట్టు పశ్చిమగోదావరి జట్టుపై, కరీంగనర్ జట్టు గుంటూరు జిల్లాపై, అనంతపురం జిల్లా జట్టు విజయనగరం జిల్లాపై గెలుపొందాయని వెల్లడించారు. బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు ఖమ్మంపై, మెదక్ జట్టు పశ్చిమ గోదావరిపై, నల్గొండ జట్టు కర్నూలుపై, కడప జట్టు గుంటూరుపై, ఆదిలాబాద్ టీం నెల్లూరుపై, తూర్పు గోదావరి జట్టు వరంగల్ జిల్లా జట్టుపై విజయం సాధించాయన్నారు. -
సీమాంధ్ర మంత్రులు రాజీనామా సరికాదు: కేఎల్ఆర్
సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు చేయడం సరికాదని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) మంగళవారం హైదరాబాద్‌లో అభిప్రాయపడ్డారు. మంత్రుల రాజీనామాలతో రాష్ట్రంలో పాలన స్తంభిస్తుందన్నారు. సీఎం కిరణ్ తక్షణమే మంత్రివర్గాన్ని సమావేశపరిచి, తాజా పరిస్థితిపై సమీక్షించాలని సూచించారు. రాజీనామాలు చేసిన మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా సీఎంకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పాలనను మెరుగుపరిచి అభివృద్ధి, సంక్షేమ పథకాలు సజావుగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి హితవు పలికారు.