
రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలు తమ పరిశీలనలో ఉన్నాయని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ చెప్పారు. ఇప్పటివరకు ఎనిమిది రాజీనామాలు వచ్చాయని, వాటిని పార్లమెంటు సచివాలయం పరిశీలిస్తోందని వెల్లడించారు. బ్రిటిష్ పాలనలోని సేవకుల ఫోటోల ఆధారంగా మీరాకుమార్ కుమార్తె దేవాంగన కుమార్ గీసిన చిత్రాల ప్రదర్శన శనివారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటైంది. ఈ ప్రదర్శనకు హాజరైన మీరాకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎంపీల రాజీనామాల విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, అయితే ఇందుకు ఎలాంటి కాలపరిమితి లేదని చెప్పారు.
ఈ అంశంలో ఎంపీలను వ్యక్తిగ తంగా పిలిపించి మాట్లాడవచ్చని, లేకపోవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లోక్‌సభలో సభ్యుల ఆందోళనల కారణంగా సభకు అంతరాయం కలుగుతున్న మాట వాస్తవమేనని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని తాను అన్ని పార్టీల నేతలనూ కోరుతున్నానని వివరించారు. ‘పెజెంట్స్ ఆఫ్ ది రాజ్ - ది వర్క్‌ఫోర్స్’ పేరిట స్పీకర్ మీరాకుమార్ కుమార్తె దేవాంగన ఏర్పాటు చేసిన ప్రదర్శనకు రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, సునీతా లక్ష్మారెడ్డి, ప్రసాదకుమార్, ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నంది ఎల్లయ్య, హర్షకుమార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వి. హనుమంతరావు, సుబ్బిరామిరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, రేణుకా చౌదరి, కనుమూరి బాపిరాజు, సీఎం.రమేశ్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జ్యోతిష్య నిపుణుడు దైవజ్ఞశర్మ తదితరులు హాజరయ్యారు. బ్రిటిష్ పాలనలోని సేవకుల ఫోటోల ఆధారంగా దేవాంగన గీసిన అప్పటి కార్మికులు, కూలీలు, సేవకులు, వివిధ వృత్తికారుల చిత్రాలు ఆకట్టుకున్నాయి.
నో కామెంట్స్ ఆన్ పాలిటిక్స్ : జైపాల్
రాజకీయాలపై తాను ఏమీ మాట్లాడనని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. దేవాంగన పెయింటింగ్స్ బాగున్నాయని ప్రశంసించారు.
భద్రాచలం గురించి మాట్లాడితే....
ప్రదర్శనకు హాజరైన ఏఐసీసీ అధికార ప్రతినిధి, ఎంపీ రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, భద్రాచలం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ‘భద్రాచలంపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఇప్పుడు అది ఎక్కడ ఉందో భవిష్యత్తులోనూ అక్కడే ఉంటుంది. ఖమ్మం జిల్లాలో భాగంగా ఉంటుంది. దానిని మాకు కావాలి అని అంటే ముందు నాతో కొట్లాడాల్సి వస్తుంది’ అని అన్నారు. తెలంగాణలో ఉత్తరాంధ్ర జిల్లాలను కలపాలన్న డిమాండ్‌కు తాను కట్టుబడి ఉన్నానని, ఈ మేరకు ఆంటోనీ కమిటీకి నివేదిక ఇస్తానని ఆమె చెప్పారు.
రెండు రాష్ట్రాలైనా ఇలానే కలిసుంటాం: ఎంపీలు
స్పీకర్ మీరాకుమార్ కుమార్తె చిత్ర ప్రదర్శనకు హాజరైన తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు పరస్పరం ఛలోక్తులు విసురుకున్నారు. కేంద్రమంత్రి కావూరి, ఎంపీలు గుత్తా, హర్షకుమార్, కోమటిరెడ్డిలతో పాటు డిప్యూటీ సీఎం రాజనర్సింహ, మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు సరదాగా మాట్లాడుకున్నారు. ‘రెండు రాష్ట్రాలు ఏర్పడినా మేమంతా ఇలానే కలిసి ఉంటాం’ అని గుత్తా అనడంతో అందరూ నవ్వులు చిందించారు. టీటీడీ చైర్మన్ బాపిరాజు స్పీకర్ మీరాకుమార్‌కు తిరుపతి ప్రసాదాన్ని అందజేశారు.