కావలి, న్యూస్‌లైన్ : తెలుగుజాతిని విచ్ఛిన్నం చేయాలని కేంద్రం కుట్ర చేస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు.
ఈ సందర్భంగా మేరిగ మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేస్తున్న రాజకీయ నేతల్లో ఒకేఒక్కడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రశంసించారు. మిగిలిన రాజకీయ నాయకులు సమైక్యాంధ్ర పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని, రాష్ట్రం సమైక్యంగా ఉంటే వారి భవిష్యత్తు బాగుంటుందన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న ప్రతాప్‌కుమార్‌రెడ్డిని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కావలి సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఓట్లు, సీట్లు కోసం కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలుగు బిడ్డను నిట్టనిలువునా చీల్చాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. సమైక్యం కోసం యూపీఏపై తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు.
అంతకు ముందు ట్రంకురోడ్డులోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి, తహశీల్దార్ కార్యాలయం సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ పాండురంగారెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణ నాయకుడు పొనుగోటి శ్రీనివాసులురెడ్డి, కావలి పట్టణ, రూరల్, అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాలకు చెందిన నేతలు, వివిధ కళాశాలలకు చెందిన సుమారు 5 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగుజాతి విచ్ఛిన్నానికి కుట్ర
Published Wed, Dec 11 2013 3:19 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement