చీరాల అర్బన్, న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి పగడాల లక్ష్మయ్య ఆరోపించారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఎస్‌ఎఫ్‌ఐ 36వ జిల్లా మహాసభలు స్థానిక పాపరాజుతోటలోని ఎస్‌జే రంగనాయకులు, బాపనమ్మ కల్యాణ మండపంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు జిల్లా కార్యదర్శి బి.రఘురాం అధ్యక్షత వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరుకు ప్రభుత్వం ఆధార్‌ను ముడిపెట్టి విద్యార్థులను ఇబ్బంది పెడుతోందని లక్ష్మయ్య మండిపడ్డారు. ఆధార్ పూర్తిస్థాయిలో అందకపోవడంతో 8 లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు.
కొన్ని కళాశాలలను ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసమే నిర్వహిస్తున్నారని, అధ్యాపకులను నియమించడంలో యాజమాన్యాలు మీనమీషాలు లెక్కిస్తున్నాయని ధ్వజమెత్తారు. యూకేజీ నుంచే అధిక ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తున్న కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం కళ్లెం వేయలేకపోతోందన్నారు. ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని ఏటా విద్యాశాఖ మంత్రి చెబుతున్నా తీరా పరీక్షల సమయానికి పాత పద్ధతిలోనే నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్పొరేట్ కళాశాలల ఒత్తిళ్లకు మంత్రులు లొంగిపోతున్నారని ఆరోపించారు. విద్యార్థినులు కళాశాలలకు వెళ్లి తిరిగి ఇంటి వచ్చేదాకా తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటున్నారన్నారు. విద్యాభివృద్ధికి చేయాల్సిన కార్యాచరణపై మూడు రోజుల మహాసభల్లో చర్చించనున్నట్లు లక్ష్మయ్య తెలిపారు. తొలుత ఎస్‌ఎఫ్‌ఐ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు టి.మహేశ్, జిల్లా కమిటీ సభ్యులు డి.శాలినీ, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏసురాజు, యేసురత్నం, చీరాల డివిజన్ నాయకులు బాలకృష్ణ, రవి, ఆదిత్య, శ్రీకాంత్, ప్రవీణ్, అనిల్, గోవర్ధన్, ఒంటరి నాగమణి, ఎన్.బాబూరావు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర
Published Tue, Jan 7 2014 3:38 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement
Advertisement