విద్యార్థి సమస్యలు పరిష్కరించాలి
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ (భారత విద్యార్థి సమాఖ్య) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అంతకుముందు విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించడానికి ప్రయత్నించ డంతో పలువురు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తుగా పోలీసులు కోర్టు ఎదురుగా ఉన్న రోడ్డు వద్ద ఇనుప కంచె ఏర్పాటుచేసి, విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకు రాకుండా నిలువరించారు. దీంతో పోలీసులకు, విద్యార్థి నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విద్యార్థులకు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుని వెళ్లడానికి ప్రయత్నించడంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రఘురాం నాయక్, నగర అధ్యక్షుడు వినయ్‌కుమార్‌లు మాట్లాడారు. విద్యార్థులకు ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఆధార్‌కార్డుతో లింకుపెట్టి, 6,284 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను నిలిపివేశారన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలను విద్యార్థుల భవిష్యత్తుకు ముడిపెట్టడం సరికాదన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వం, తన స్వార్థపూరిత ప్రయోజనాల కోసం విద్యార్థులను బలిచేస్తోందని మండిపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ కార్డులు అందకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ఇంజినీరింగ్‌తో పాటు మెడిసన్,ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులతోపాటు జనరల్ కోర్సుల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు వస్తాయని అడ్మిషన్ చేసుకొని, ప్రస్తుతం అవి వస్తాయో రావో అంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుపేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారన్నారు. చదువును మధ్యలో ఆపేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆధార్‌తో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నరేష్ శంకర్ వేణు అనిల్‌తో పాటు సుమారు ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.