ఫీజు రీయింబర్స్‌మెంట్ రగడ
ఏపీ సర్కార్ తీరుతో ఆంధ్రప్రాంత విద్యార్థుల ఆందోళన
గజ్వేల్: ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందని ఆంధ్రప్రాంత విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తేనే పరీక్ష ఫీజు తీసుకుంటామంటూ కళాశాల యాజమాన్యం ఒత్తిడి పెంచడంతో 11 మంది విద్యార్థులు సోమవారం సాయంత్రం కళాశాల భవనంపైకి ఎక్కి దూకేస్తామని హెచ్చరించారు. గంటన్నరపాటు హైడ్రామా నెల కొన్నది. కడపకు చెందిన సంజీవరెడ్డి, గాజులపల్లి అశోక్‌రెడ్డి, విశాఖపట్నంకు చెందిన బీల రవీంద్ర, ఆశాజ్యోతి, మురళి, ప్రసాద్, తాడిపత్రికి చెందిన ఆశోక్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్, కర్నూలు జిల్లాకు చెందిన మహేశ్, విజయనగరానికి చెందిన చంద్రిక శివ, అప్పలనాయుడు మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని సయ్యద్ హషీమ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నారు.
వీరికి ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదు. దీనిని సాకుగా తీసుకొని కళాశాల యాజమాన్యం వార్షిక పరీక్షల ఫీజు తీసుకోవడం లేదు. ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 3వ తేదీతోనే ముగిసింది. అపరాధ రుసుం గుడువు పూర్తయ్యే వరకు తమ సమస్య పరిష్కరమవుతుందో లేదోనని విద్యార్థులు ఆందోళన చెందారు. కళాశాల భవనంపైకి ఎక్కి కిరోసిన్ బాటిల్ చూపుతూ హెచ్చరించారు. గజ్వేల్ ఎస్‌ఐ సత్యనారాయణ జోక్యంతో విద్యార్థులు శాంతించారు.