రోదిస్తున్న మృతుడి భార్య ఎమ్మెల్యే పల్లా వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న మృతుడు రాజబాబు
విశాఖపట్నం , పెందుర్తి: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారి(బైపాస్) పెందుర్తి మండలం పినగాడి కూడలి వద్ద గురువారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు రాజబాబు(33) గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వద్ద ప్రస్తుతం గన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చీడికాడ మండలం తంగుడుబిల్లి గ్రామానికి చెందిన కణితి కొండయ్య, రామలక్ష్మి దంపతులకు నాలుగో సంతానం రాజబాబు. అతడికి ఎనిమిదేళ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం గాజువాక ఎమ్మెల్యే పల్లా వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పెందుర్తిలో భార్య శ్రీలక్ష్మితో నివాసం ఉంటున్న రాజబాబు గురువారం సాయంత్రం స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు.
పినగాడి కూడలి వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం రాజబాబు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. రోడ్డుపై తుళ్లిపడడంతో తలకు, శరీరానికి తీవ్రగాయాలై అక్కడిక్కడే మరణించాడు. స్థానికుల సమాచారంతో ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుని జేబులోని ఐడీ కార్డు ఆధారంగా వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు జరుగుతుంది. మూడేళ్ల క్రితం రాజబాబుకు శ్రీలక్ష్మితో వివాహం జరగ్గా ఇటీవలే వీరికి పాప పుట్టి అనారోగ్యంతో మరణించింది. తంగుడుబిల్లిలో నివాసం ఉంటున్న తల్లిదండ్రులు కొండయ్య, రామలక్ష్మితో పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అన్నయ్య కుటుంబానికి రాజబాబు సంపాదనే ఆధారం. రాజబాబు మరణంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మృతుడి కుటుంబ సభ్యులకుసీపీ పరామర్శ
ద్వారకానగర్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ రాజబాబు కుటుంబ సభ్యులను కేజీహెచ్ వద్ద గురువారం రాత్రి నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్రలడ్డా, డీసీపీ రవీంధ్రబాబు, ఏడీసీపీ (ఎస్‌బీ) శ్రీనివాస్‌రావు పరామర్శించి ఓదార్చారు. మృతదేహం వద్ద సీపీ నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment