పోలీసు ఉద్యోగం వచ్చింది. పెళ్లిచేసి ఓ ఇంటివాడ్ని చేసేందుకు తల్లిదండ్రుల ప్రయత్నం ఫలించింది. కొడుకు పెళ్లిపీటలు ఎక్కుతాడని ఆనందపడిన తల్లిదండ్రులను చూసి విధి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదంలో వారి కొడు కును కబళించింది. అధికార లాంఛనాలతో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు.
తిరుపతి / బి.కొత్తకోట : బి.కొత్తకోట పంచాయతీ డేగానిపల్లెకు చెందిన శివశంకర్, మునివెంకటమ్మకు కొడుకు కే.రాజేంద్రప్రసాద్ (28), మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివశంకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆరేళ్ల క్రితం రాజేంద్రప్రసాద్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందాడు. ముదివేడు, మదనపల్లెల్లో పనిచేస్తూ రెండేళ్లక్రితం యర్రావారిపాళెంకు బదిలీ అయ్యాడు. ఈ నేపథ్యంలో కుమారుడికి వివిధ ప్రాంతాల్లో వివాహ సంబంధాలు చూశారు. చివరగా బురకాయలకోటకు చెందిన ఓ యువతి నచ్చడంతో రాజేంద్రప్రసాద్ పెళ్లికి అంగీకరించాడు.
యువతి తండ్రి అయ్యప్పమాల ధరించడంతో వివాహ నిశ్చితార్థం వాయిదా పడింది. నాలుగురోజుల క్రితం యువతి తండ్రి పెళ్లి విషయమై శివశంకర్‌తో చర్చించాడు. రాజేంద్రప్రసాద్ విషయంలో విధి చిన్నచూపు చూసింది. విధి నిర్వహణలో భాగంగా ఆదివారం ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా పీలేరు వద్ద ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడటం విదితమే. ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. సోమవారం మృతి చెందాడు. అదేరోజు రాత్రి మృతదేహాన్ని డేగానిపల్లెకు తరలించారు. మంగళవారం యర్రావారిపాళెం ఏఎస్‌ఐ ఎస్‌ఎండీ.కాలేషా, బి.కొత్తకోట పీఎస్ హెచ్‌సీ ఎం.మురళీధర్, పీసీ భద్ర, ఆరుగురు చిత్తూరు ఏఆర్ పోలీసులు డేగానిపల్లెకు చేరుకుని అంత్యక్రియల సమయంలో గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి మృతదేహానికి గౌరవ వందనం చేశారు. అధికార లాంఛనాలు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment