దేవుడి భూమిలో దోపిడీ పర్వం..!  | Construction Of Shopping Complex In Neelakanteswara Swamy Temple | Sakshi
Sakshi News home page

దేవుడి భూమిలో దోపిడీ పర్వం..! 

Published Mon, Jul 6 2020 8:22 AM | Last Updated on Mon, Jul 6 2020 8:27 AM

Construction Of Shopping Complex In Neelakanteswara Swamy Temple - Sakshi

చీపురుపల్లి మెయిన్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న వివాదస్పద స్థలంలో సాగుతున్న వాణిజ్య భవనం పనులు

విషాన్ని కంఠంలో దాచి లోకాన్ని కాపాడిన నీలకంఠుని భూములకే రక్షణ లేకుండా పోయింది. గతంలో ప్రజలు కట్టబెట్టిన అధికారంతో దశాబ్దాలుగా దేవుని ఆస్తిని అప్పనంగా అనుభవిస్తున్నాడు. మాజీ శాసన సభ్యుడి హోదాలో అధికారులను గద్దిస్తూ ఆలయ భూమిపై వచ్చే ఆదాయాన్ని మింగేస్తున్నా డు. ‘గద్దె’నెక్కిన నాటి నుంచి నేటికీ ఆ భూమిపై సొమ్ముజేసుకున్నది చాలక ఇప్పుడు ఏకంగా వాణిజ్య సముదాయం నిర్మాణాన్ని తలపెట్టా్టడు. రూ.కోట్లు సంపాదించాలనుకుంటున్న ఆ ‘బాబు’ భాగోతం అధికారులకు తెలిసి నోటీసులు జారీచేశారు. అప్పటికీ వినకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం–పాలకొండ ప్రధాన రోడ్డులో చీపురుపల్లి మెయిన్‌రోడ్‌ను ఆనుకుని, మూడు రోడ్ల కూడలి ఎదురుగా నీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన సర్వే నంబర్‌ 45/1లో 9 సెంట్లు స్థలం ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెంటు ధర రూ.15 లక్షల పైబడి పలుకుతోంది. ఈ లెక్కన ఆ భూమి ఖరీదు రూ.1.5 కోట్లు వరకు ఉంటుందని అంచనా. మూడు, నాలు గు దశాబ్దాల కిందట ఈ స్థలంలో కొత్తకోట సరస్వతి, మా రోజు జగన్మోహిని అనే ఇద్దరు పేద మహిళలు దుకాణాలు పెట్టుకుని ఉండేవారు. ఆ తరువాత కాలంలో ఒక ప్రజాప్రతినిధి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాడు.  

మూడు దశాబ్దాలుగా...  
ఆ స్థలంలో ఆ ప్రజాప్రతినిధికి చెందిన నటరాజ్‌ వైన్‌ షాప్‌ ఉండేది. దేవస్థానానికి ఆనుకుని ఉన్న ఈ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణం నడిపేవారు. 2010లో ఈ స్థలంలో ఆక్రమణదారులను తొలగించేందుకు దేవాదాయశాఖ ప్రయతి్నంచింది. ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లింది. దేవాదాయశాఖకు ఆ స్థలాన్ని ట్రిబ్యునల్‌ ఖరారు చేసింది. ట్రిబ్యునల్‌ తీర్పును సవాల్‌ చేస్తూ కొత్తకోట సరస్వతి, మారోజు జగన్మోహినిలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తు తానికి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. కేసు తేలనందున ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం ఆ స్థలం దేవాదాయ శాఖకు చెందినదే. అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే అధికారం ముందు అధికారులు నిలువలేకపోయారు. ఎందుకంటే కోర్టులో పిటిషన్‌ వేసినవారి నుంచి మాజీ ఎమ్మెల్యే స్థలాన్ని తీసుకున్నారు. 2010 నుంచి ఇంతవరకు దేవాదాయశాఖకు కనీసం అద్దె కూడా చెల్లించలేదు. సుమారు రూ.4 లక్షలు అద్దె బకా యిలు కూడా అలానే ఉన్నాయి. 

అద్దెలోనూ పెత్తనమే....  
గత ఏడాది కాలంగా ఈ స్థలంలో ఉన్న నటరాజ్‌ వైన్‌షాపు లో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఎక్సైజ్‌ శాఖ నిర్వహించింది. దీనికి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ వారు నెలకు రూ. 21 వేలు అద్దె చెల్లించేవారు. తాజాగా ఆ ప్రజాప్రతినిధి తనకు నెలకు రూ.35 వేలు అద్దె కావాలని అడగడంతో ఇటీవల మద్యం దుకాణాన్ని ఎత్తేసి వేరేచోటకు తరలించారు. ఖాళీ అయిన ఆ తొమ్మిది సెంట్ల స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఆ పెద్దమనిషి పనులు ప్రారంభించారు. నిర్మాణం పూర్తయితే దుకాణాలకు గ్రౌండ్‌ఫ్లోర్‌లో అయితే నెలకు రూ.30 వేలు, పై ఫ్లోర్‌లో అయితే రూ.15 నుంచి 20 వేలు వరకు అద్దెలు వస్తాయి.  

నోటీసులు జారీ...  
అనుమతి లేకుండా దేవాశాఖ భూమిలో ప్రారంభమైన నిర్మాణాలను నిలిపివేయాల్సిందిగా ఆ శాఖ అధికారులు గతంలో కోర్టుకు వెళ్లిన వారికి నోటీసులు జారీ చేశారు. చిత్రంగా నోటీసులు అందుకున్న వారు తమకు ఆ స్థలంతో ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. కానీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. అంటే పనులను ఆ మాజీ ఎమ్మెల్యే జరిపిస్తున్నట్టు సమాచారం. దీంతో దేవాదాయశాఖ అధికారులు చీపురుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆక్రమిత స్థలంలో అక్రమ నిర్మాణాన్ని నిలువరించి ఆలయ భూమిని కాపాడాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భూమి కోర్టులో ఉన్న అంశం కావడంతో ఉన్నతాఅధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎస్‌ఐ ఐ. దుర్గాప్రసాద్‌ తెలిపారు. 

ఆ స్థలంలో నివసించడం లేదు..  
ఎప్పుడో 40 సంవత్సరాల కింట ఆ స్థలంలో మా నాన్న ఉన్నప్పుడు దుకాణాలు ఉండేవి. ఆ తరువాత ఆ స్థలాన్ని మా తమ్ముడికి మా నాన్న ఇచ్చారు. మా తమ్ముడు ఎవరికైనా అమ్మేసాడో లేక ఇచ్చేసాడో తెలియదు. ఎప్పుడూ మాకే నోటీసులు వస్తాయి. శనివారం కూ డా దేవాదాయశాఖ అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పుడు మేము ఆ స్థలానికి పక్కన చిన్న బడ్డీలో అరటి పండ్లు, పూజ సామగ్రి వ్యాపారం చేసుకుంటున్నాం. మాకు ఆ స్థలంతోను, అక్కడ జరుగుతున్న నిర్మాణంతో ఎలాంటి సంబంధం లేదు. 
– కొత్తకోట సరస్వతి, దేవాదాయశాఖ నోటీసు అందుకున్న మహిళ, చీపురుపల్లి 

నోటీసులు ఇచ్చాం.. ఫిర్యాదు చేశాం: 
నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం స్థలంలోని సర్వే నంబర్‌ 45/1లో కట్టడాలు నిలిపివేయాలని కొత్తకోట సరస్వతి, మారోజు జగన్మోహినిలకు ఈ నెల 4న నోటీసులు ఇచ్చాం. వారు గతంలో కోర్టును ఆశ్రయించారు. ఇంకా కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలే దు. ఇంతలో ఆ స్థలంలో నిర్మాణాలు ఎలా జరుపుతా రని నోటీసులు ఇచ్చాం. 2010 నుంచి ఆ స్థలంకు సంబంధించిన అద్దె కూడా చెల్లించలేదు. నోటీసులు ఇచ్చినా కూడా పనులు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం.‘ 
– కిషోర్‌కుమార్, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్,  నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement